Construction Works Stopped for Four Years: విజయవాడలోని 68వ డివిజన్ పాత రాజీవ్ నగర్ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది జనాభా నివసిస్తారు. ఈ ప్రాంతంలో ఏదైనా శుభకార్యం జరుపుకోవాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను గుర్తించి గతంలో టీడీపీ పాలకులు ఈ ప్రాంతంలో స్థానికుల అవసరాల నిమిత్తం సామాజిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
పాత రాజీవ్ నగర్ ప్రాంతంలో నగర పాలక సంస్ధకు చెందిన స్థలంలో దాదాపు 40 లక్షల రుపాయల వ్యయంతో 2018లో టీడీపీ హయంలో సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంఖుస్థాపన చేసిన తర్వాత గుత్తేదారు పనులను ప్రారంభించారు. భవనం పిల్లర్ల దశకు చేరిన సమయానికి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ వల్ల భవన నిర్మాణం నిలిచిపోయింది.
2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో సామాజిక భవన నిర్మాణానికి గ్రహణం పట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గుత్తేదారు బేస్‌మెంట్‌తో పాటు పిల్లర్ల దశ వరకు పూర్తి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లుల చెల్లించకపోవడంతో సదరు గుత్తేదారు ఎక్కడి పనులను అక్కడే వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను స్థానికులు కోరినా పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వ పాలనలో మొదలు పెట్టింది.. మనమెందుకు చేయడమంటూ ప్రజా ప్రతినిధులు అంటున్నారని స్థానికులు అంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఏ ప్రభుత్వమైతే ఏంటి అంతా ప్రజాధనమే కదా.. ఇప్పటికే భవన నిర్మాణం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కదా భవన నిర్మాణం పూర్తి చేస్తే తప్పేంటని ప్రభుత్వాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నిర్మాణం చేస్తున్న భవనాన్ని మధ్యలోనే అధికారులు, ప్రజా ప్రతినిధులు అలాగే వదిలేయడంతో ప్రస్తుతం అది ఆకతాయిలకు అడ్డాగా మారింది. ఆదే ప్రాంతంలో మరో పాత భవనం ఒకటి ఉండటంతో మందుబాబులు రాత్రి సమయంలో ఇక్కడికి చేరి నానా హంగామా చేస్తున్నారని మహిళలు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.