Congress Leaders Celebrations in AP on TS Election Results: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో ఏపీలోని పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో గడియార స్తంభం కూడలిలో విజయోత్సవాలు మిన్నంటాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి రేవంత్ రెడ్డి కృషి చేసారని, ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందని చీరాల నియోజకవర్గ ఇంఛార్జ్ దేవరపల్లి రంగారావు అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని, అదే విధంగా ఏపీలో కూడా వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమన్నారు.
విజయవాడలోనూ పార్టీ శ్రేణులంతా ఆనందోత్సవంలో మునిగిపోయారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏపీలోనూ తమ పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్న రాష్ట్రంలోని సైకో పాలనకు సైతం చరమగీతం పాడటం ఖాయమని స్పష్టం చేశారు.
దూసుకుపోతున్న కాంగ్రెస్ - తొలి అడుగు అశ్వారావుపేటతో మొదలు
అనంతపురంలోని రాయదుర్గంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహంచారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఓటర్లు కోలుకోని దెబ్బకొట్టారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వైపు దూసుకు వెళ్తుండటంతో జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి కళ్యాణదుర్గం టీ కూడలి వద్దకు భారీ ఎత్తున చేరుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి, స్వీట్స్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఏపీలో కూడా తమ పార్టీ నాయకుడు రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందని, అందుకోసం తాము నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్‌ను ఇంటికి పంపిన ప్రజలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి దుకాణం మూయించేందుకు సిద్ధమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్ అన్నారు. అనంతపురంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు సంయుక్తంగా సంబరాలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ను ప్రజలు కోలుకోలేని దెబ్బకొట్టారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, తాము ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని తెలంగాణ ప్రజలు గుర్తించటంవల్లనే అప్రమత్తమై కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు.
తెలంగాణలో కేసీఆర్‌ను గెలిపించడానికి జగన్ కుట్ర పన్నారు : సీపీఐ నారాయణ