Crime against women through social media: "సోషల్ మీడియా-మహిళలపై దాడి" అనే అంశంపై..రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహించిన సదస్సు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ ప్రజాప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించి, ఇతర రాజకీయ పార్టీలకు అనుమతి లేదంటూ తమను అడ్డుకునే చర్యల్ని తెలుగుదేశం, జనసేన మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. సీఎం భార్య కోసం కాకుండా రాష్ట్రంలోని మహిళలందరి సమస్యలపై వర్క్ షాప్ పెట్టాలని మహిళా కమిషన్‌కు విపక్షాలు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చాయి. స్పెషల్‌బ్రాంచ్ పోలీసులమంటూ కొందరు నిరసనకు వచ్చిన మహిళల్ని కించపరిచేలా వ్యవహరించడంతో.. వారిపై తెలుగు మహిళలు చెప్పులతో తిరగబడ్డారు.
సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిని ఖండిద్దామంటూ విజయవాడలో హోటల్ ఐలాపురంలో మహిళా కమిషన్ సెమినార్ నిర్వహించింది. మహిళా నాయకులు, ప్రముఖుల పట్ల సోషల్ మీడియా ధోరణి హద్దులు దాటుతోందని.. వీటిని కట్టడి చేసేందుకే ఈ సెమినార్ నిర్వహిస్తున్నట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. సీఎం కుటుంబంలోని మహిళలపైనా సోషల్ మీడియాలో ఉన్మాదంగా వ్యవహరించడం దారుణమన్నారు. అన్ని వర్గాల మహిళలు బాధితులుగా మారుతున్న పరిస్థితిపై అందరూ స్పందించాలని మహిళా కమిషన్ కోరింది. సెమినార్‌లో తమ అభిప్రాయాలు, సూచనలు తెలపాలంటూ వివిధ మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, డ్వాక్రా సంఘాలను కమిషన్ ఆహ్వానించింది. సోషల్ మీడియాలో సీఎం సతీమణే కాదు తాము సైతం బాధితులమంటూ తెలుగుదేశం-జనసేన మహిళా నేతలు సెమినార్‌లో పాల్గొనేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది.