Condition of Contract Employees of Health Department: రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నా వారింకా తాత్కాలిక ఉద్యోగులే. రిటైర్మెంట్ దగ్గరపడుతున్నా.. ఎప్పుడు పర్మినెంట్ చేస్తారా అని నిరీక్షణ. వైసీపీ ప్రభుత్వ హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని.. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఒక్క పైసా ఆర్థిక సహాయం అందలేదని మండిపడుతున్నారు. రేషన్ కార్డ్, ప్రభుత్వ పథకాలు నిలిపివేయడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ విజయవాడలో జరిగిన ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో గోడు వెళ్లబోసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన జిల్లాలకు కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. హామీలు నెరవేర్చకుంటే ఉద్యమానికి సైతం వెనకాడబోమని ఉద్యోగ నేతలు తేల్చిచెబుతున్నారు. డిసెంబర్ 11న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సభకు సంబంధించిన గోడ ప్రతులు, కరపత్రాలు, జెండాను ఆవిష్కరించారు.