Troubles of brick kilns: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఇసుక పాలసీ పేరుతో దాదాపు రెండేళ్లు ఇసుక సరఫరాకు అటంకం కల్పించడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. మరోవైపు సిమెంట్, ఐరన్ ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఇళ్ల నిర్మాణాలకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం జగనన్న కాలనీను నిర్మిస్తామని చెప్పడంతో నిర్మాణ రంగంతో కొంత ఉత్సాహం కనిపించినా ప్రభుత్వ తీరుతో ఇళ్ల నిర్మాణం నత్తతో పొటి పడుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రధానంగా ఇటుకల బట్టీల నిర్వాహకులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇటుకల బట్టీలను నిర్వహిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఇటుకల బట్టీల నిర్వహకులు చెబుతున్నారు.
మిర్యాలగూడ, దావులూరు, తెలంగాణ నుంచి ఇటుకల తయారీకి మసీని తీసుకొస్తున్నాం... ముడి సరుకు రేట్లు, కూలీల రేట్లు పెరుగుతున్నా ఇటుకల రేటు మాత్రం పెరగడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఉమ్మడి కృష్ణజిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇటుకల బట్టీలు ఉండేవని ఇప్పుడు 500లోపు మాత్రమే ఇటుకల బట్టీలు ఉన్నాయని వారు పెర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్లతో అయినా ఆర్థిక కష్టాలు తీరుతాయని భావించగా ఆ ఇళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండటంతో వారు నిరాశకు గురవుతున్నారు.
ప్రభుత్వం ఇస్తున్న లక్ష 80 వేలు సరిపోకపోవడంతో అప్పులు తీసుకువచ్చే ఆర్థిక స్తోమత లేక చాలామంది ఇంటి నిర్మాణాలను నిలిపివేశారు. ఇంటి నిర్మాణాలు జరిగితే ఇటుకలను కొనుగోలు చేస్తారని దానివల్ల తమకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని నిర్వహకులు చెప్తున్నారు. ఇటుకలు తయారు చేయాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని పెర్కొన్నారు. ఇటుకల బట్టీలో ప్రస్తుతం ఒక మనిషి రోజు కూలీ 500 నుంచి 600 వరకు ఉందని, ఇక్కడ కూలీల భారాన్ని తట్టుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఇటుకలు తయారు చేసేందుకు ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూలీలను తీసుకువస్తున్నామన్నారు.