CM Jagan Review : మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రుల సందర్శన ప్రారంభించాలని.. గోరుముద్దలో భాగంగా వారానికి మూడు సార్లు పిల్లలకు రాగిమాల్ట్ పంపిణీ ప్రారంభించాలని సూచించారు. అన్ని బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ నివారణ పరికరాలు, చికిత్సలతో పాటు క్యాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం సమీక్షించారు. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలతో పాటు, సిబ్బందిని నియమించాలని అదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యేల, ప్రజా ప్రతినిధులు ఆసుపత్రుల సందర్శన వల్ల ఆసుపత్రులపై పర్యవేక్షణ ఉంటుందని సీఎం వివరించారు. సమస్యలు, లోపాలు ఉంటే ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం వల్ల పరిష్కర మార్గం దొరుకుతుందని అన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని భావించారు. ఆసుపత్రులలో మందులు, సర్జికల్స్ అన్నీ అందుబాటులో ఉండాలని అదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం చర్చించారు. మార్చి 1న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్స్ అన్నీ అందుబాటులో ఉండాలన్నారు. మందులకు కొరత ఉందన్న మాట ఎక్కడ వినిపించకూడదని హెచ్చరించారు.
వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న సీఎం.. గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలతో అనుసంధానమై రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్నారు. విలేజ్ క్లినిక్స్ సిబ్బంది నుంచి సమస్యలున్నాయని తెలిసిన వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్లు వీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు.