CM KCR Speech in Khammam BRS Meeting : టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా ఆవిర్భవించిన అనంతరం ఖమ్మంలో తొలిసారి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు. జాతీయ నాయకుల సమక్షంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంచి స్పందన లభించింది. సభకు సీపీఐ, సీపీఎం, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన అగ్రస్థాయి నాయకులను రప్పించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముందడుగు వేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే వేదికపై నలుగురు సీఎంలు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి ఆసీనులవ్వడం సభకు ప్రధాన ఆకర్షణగా మారింది. బీజేపీని బలంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు, సీఎంలను ఒకే వేదికపైకి చేర్చడం ద్వారా కేసీఆర్ విజయవంతమయ్యారు. కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఈ బహిరంగ సభ ద్వారా తొలి అడుగు పడినట్లయింది.
Khammam BRS Meeting: 2001లో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. గత 22 ఏళ్లలో క్రమంగా బలపడుతూ వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాల వైపు ప్రయాణం మొదలుపెట్టింది. కేసీఆర్ తన ప్రసంగంలో విపక్షాలు కేంద్రంలో అధికారంలోకి వస్తే తామేం చేయబోతున్నామనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు తదితర సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ఎలా అమలు చేస్తామన్న అంశాన్ని ప్రస్తావించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వీటినే ప్రధాన ప్రచారాస్త్రాలుగా వాడుకునే అవకాశం ఉంది. రైతు బీమా, రైతుబంధు పథకాలను చెప్పడం ద్వారా దేశంలో అత్యధికంగా ఉన్న అన్నదాతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.
అన్నదాతల మద్దతుతో విస్తరించేందుకు సంకేతాలు..: బహిరంగ సభ ప్రధాన వేదికపై జాతీయ నాయకుల చిత్రపటాలతో పాటు 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అన్న నినాదంతో పాటు నాగలి ఎత్తిన రైతు, కాళేశ్వరం ప్రాజెక్టు చిత్రాలను ఉంచడం ఆకర్షించింది. ఈ నినాదాన్ని ఎక్కువ మంది జనాల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ముద్రించారు. మోదీ సర్కారుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న కేసీఆర్.. తాను అమలు చేస్తున్న పథకాల ద్వారా అన్నదాతల మద్దతు కూడగట్టి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే ప్రయత్నాలకు ఈ సభ నుంచి సంకేతాలిచ్చారు.
కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం బీజేపీపై విమర్శలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై కొనసాగింది. ముందుగా ఖమ్మం జిల్లాకు వరాల జల్లు కురిపించి, తర్వాత జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వబోమన్నారు. ఒకవేళ కేంద్రం చేసినా విపక్షాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తిరిగి జాతీయీకరణ చేస్తామని వెల్లడించినప్పుడు సభికుల హర్షధ్వానాలు మిన్నంటాయి.