Cm Meeting With Ministers : సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అమాత్యులతో కొద్దిసేపు సీఎం మాట్లాడారు. అవినీతికి ఎవరూ పాల్పడొద్దని మంత్రులకు సీఎం జగన్ స్పష్టంగా హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా 16 నెలలు మాత్రమే ఉన్నందున.. అందరి దృష్టి వైసీపీ ప్రభుత్వంపైనే ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి మీడియా కళ్లన్నీ ప్రభుత్వంపై ఉన్నాయని.. గమనించాలని సూచించినట్టు సమాచారం. ఏ చిన్న పొరపాటు చేసినా మీడియాదానిపైనే దృష్టిపెట్టి కథనాలు ప్రచురిస్తుందని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వార్తల ప్రభావం ఎన్నికలపై ఎక్కువ ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ బటన్ నొక్కి అవినీతికి తావులేకుండా పథకాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవద్దని జగన్ సూచించినట్టు సమాచారం. మంత్రులు ఇంఛార్జ్‌లుగా ఉన్న జిల్లాల్లోనూ గడగడపకూ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవాలని.. పార్టీ నేతల మధ్య విభేదాలను సరిదిద్దాలని సూచించారు.
ఈ నెల 21న 8వ తరగతి విద్యార్ధులకు ఇచ్చేట్యాబ్‌లను మంత్రులు కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు. మంత్రుల చేతుల ద్వారానే అన్ని సంక్షేమ పథకాలూ.. అందేలా ప్రణాళికలు చేస్తున్నట్టు సీఎం వివరించినట్టు సమాచారం. ఇప్పటి వరకూ.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందుతున్నపథకాలు ఇకపై మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా అందించేలా చూస్తామని సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది.