Volunteer ki Vandanam Program Starting Today: "వాలంటీర్లకు వందనం" కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2లక్షల 33వేల 719 మందికి 243.34 కోట్ల రూపాయల నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు.
మే 19వ తారీఖు నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలు కానుంది. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు అందించనున్నారు. సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు 30వేల రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లు.. అంటే 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సేవా రత్న కింద సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు 20వేల రూపాయల నగదు బహుమతి అందించనున్నారు. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు, మొత్తంగా 4వేల 220 మందికి సేవా రత్న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.