CM Jagan Delhi Tour : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ, పర్యావరణ శాఖ మంత్రి వద్ద ప్రస్తావించిన అంశాలనే అమిత్‌షా వద్ద ప్రస్తావించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిని కోరినట్లు పేర్కొంది. అందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించడానికి సిద్దంగా ఉందని వివరించారని వెల్లడించింది. తాజా కొవిడ్ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని వివరించారని తెలిపింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న చాలా అంశాలు ఇప్పటికీ నెరవేర్చలేదని.. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని అమిత్‌షా దృష్టికి తీసుకువచ్చినట్లు సీఎంఓ ప్రకటనలో పేర్కొంది.
2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు, ఇతర శాఖల నుంచి రావాల్సిన మొత్తం సుమారు 32 వేల 625 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని హోం మంత్రికి వివరించినట్లు తెలిపింది. వాటిని వెంటనే మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి అమిత్‌షాను కోరినట్లు వివరించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2 వేల 937 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదని.. దానిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు పేర్కొంది. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన 6 వేల 886 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా హోం మంత్రిని కోరారని ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు హేతుబద్ధంగా లేవని.. దీనివల్ల రాష్ట్రంలో అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై ద్వారా లబ్ధి పొందడం లేదని తెలిపారని వివరించింది. ప్రత్యేక హోదాపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. రాష్ట్రాంలో జిల్లాల పునర్విభజనకు అణుగుణంగా.. కొత్తగా 12 జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరినట్లు వివరించింది.