CM Jagan Rush for Skill Universities: తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో స్కిల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధించేలా శిక్షణిస్తామంటూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 30 శాతం యువత ఆశలపై నీరు చల్లారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని గొప్పగా చెప్పిన సీఎం.. నాలుగున్నరేళ్లు దాటినా ఒక్కటీ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో నిరుద్యోగులు, యువత సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CM Jagan on Skill Development Universities: రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని.. దానికి అనుబంధంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ 18న సమీక్షలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన వారికి వర్సిటీ, స్కిల్ సెంటర్లు అండగా ఉంటాయని, అక్కడ మంచి సదుపాయాలు కల్పించి, బోధకులను నియమించాలని దిశానిర్దేశం చేశారు. ఇలా నైపుణ్య విశ్వవిద్యాలయాలు.. కళాశాలల ఏర్పాటుతో యువతకు విరివిగా నైపుణ్య శిక్షణ, విస్తృతంగా ఉద్యోగావకాశాలు, వేలల్లో జీతాలు వస్తాయంటూ నిరుద్యోగులను ఆశల పల్లకిలో విహరింపజేసిన సీఎం జగన్.. ఆ తర్వాత ఆ మాటలను గాలికి వదిలేశారు.
Jagan Announcement on 30 Skill Universities:లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25, పులివెందులతో పాటు నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మరో అయిదింటితో మొత్తం 30 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.20 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. 2019లో అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో హరియాణాలోని విశ్వకర్మ, రాజస్థాన్‌లోని భారతీయ, ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీలను లక్షల రూపాయలు వెచ్చించి పరిశీలించారు. తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం, కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖలో హైఎండ్ వర్సిటీ ఏర్పాటు చేసి.. బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తామని ఆశలు కల్పించారు. కానీ, ఇంతవరకు పులివెందులలో తప్ప ఎక్కడా భవనాలు నిర్మించలేదు. ట్రిపుల్ ఐటీల్లో ఏర్పాటు చేస్తామన్న నాలుగింటినీ అటకెక్కించేశారు.
PATTABHI ON SKILL DEVELOPMENT : స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో.. అది అవాస్తవం: పట్టాభి
Skill Centers Started During TDP Regime:రాష్ట్రంలో ఏటా దాదాపు 1.30 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేస్తుండగా, 40 శాతం మంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతున్నారు. మిగిలిన 60 శాతం మందికీ ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలుగుదేశం హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, వైసీపీ సర్కారు వాటిని మూసివేసింది. ప్రత్యేకంగా నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని ఘనంగా చెప్పినా.. నిధులు లేవంటూ ప్రతిపాదనలన్నీ మూలకు పడేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల్లోనే ఏపీ రాష్ట్ర ఉద్యోగ కల్పన, వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కేంద్రం డీడీయూజీకేవై కింద ఒక్కో విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఇస్తుండగా.. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోంది. మరోవైపు తగినన్ని నైపుణ్య కళాశాలలు లేకపోవడంతో ఏటా శిక్షణ పొందుతున్న విద్యార్థులు 15 వేల మందికి మించడం లేదు.