CM JAGAN REVIEW ON WOMENS AND CHILD WELFARE DEPARTMENT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ, టేక్ హోం రేషన్ పంపిణీ, చిన్నారుల పౌష్టికాహారం, ఇంగ్లిషు భాష పరిజ్ఞానం వంటి కార్యక్రమాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, టేక్ హోం రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి.. లబ్ధిదారులకు కిట్‌లు అందజేశారు.
గర్భిణీలు, బాలింతలకు రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం..రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలపై సీఎంజగన్ బుధవారం అధికారులతో సమీక్షించారు. గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చేతుల మీదుగా డ్రై రేషన్ గర్భిణీలు, బాలింతలు కిట్‌లు అందుకున్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం ప్రతి ఏడాది సుమారుగా రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాల కోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని వ్యాఖ్యానించారు. నిధులకు వెనుకాడకుండా.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు వేల కోట్లు రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు.
ఆ రెండు పథకాల లక్ష్యం అదే..డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతపై అధికారులు నిరంతరం సమీక్ష చేయాలని, నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రక్తహీనత, పౌష్టికాహారలేమి లాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలన్న లక్ష్యంతోనే.. ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్న జగన్.. మంచి ఫలితాలు వచ్చేలా, దీని కోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలని ఆదేశించారు. అక్కడ పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి.. సమస్యలుంటే వారికి మంచి వైద్యాన్ని అందించాలన్నారు.
వైసీపీ పథకాలపై అవగాహన కల్పించండి.. బాల్య వివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, చదువుల్లో బాలికలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఒడి, కళ్యాణమస్తు, వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాల ఉపయోగాలపై పిల్లలకు బాగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు–షాదీతోఫా వంటి పథకాలు ఏ రకంగా బాల్య వివాహాలను నిరోధిస్తాయో.. ప్రజలకు వివరించాలన్నారు. వధూవరులు కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధనను పెట్టామన్న విషయంపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మర ప్రచారం నిర్వహించాలని అధికారులు సీఎం జగన్ సూచించారు.
''ఫౌండేషన్ స్కూలు పిల్లలకు విద్యాబోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని, ఇప్పుడున్న విద్యావిధానం కాక ఇతర విద్యావిధానాలనూ పరిశీలించండి. ఫౌండేషన్ స్కూల్లో పిల్లల్లో ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం, ఫొనిటిక్స్, ఉచ్ఛరణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా పద్ధతులతో నేర్పించే అంశాలపై దృష్టిపెట్టండి. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలయ్యింది. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లల మీద దృష్టిపెట్టాలి. పిల్లల మెదడు బాగా వృద్ధి చెందే వయసు కాబట్టి.. వినూత్న బోధనా పద్దతుల ద్వారా వారికి మంచి భాషా జ్ఞానాన్ని అందించాలి. ఈ వయసులో పునాది గట్టిగా పడితే.. ఇక పై తరగతుల్లో విద్యార్ధుల ప్రయాణం సాఫీగా ఉంటుంది.''-వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి