CM Jagan Meeting with MLAs : 'ఏ ఒక్క ఎమ్మెల్యేను పొగొట్టుకోవాలని నేను ఎప్పుడు అనుకోను.. మీ అందర్ని పిలిపించి ఎందుకు చెప్తున్నాను అంటే.. మీతో పని చేయింటం కోసం... మీరు మళ్లీ గెలిచి రావాలనే తాపత్రయంతో చేస్తున్నాను... ప్రజల్లో మన గ్రాఫ్ సరిగా లేకపోతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బటన్లు నొక్కడం ఆపకూడదు... మీరు తిరగటం ఆపకూడదు... తిరగటం మీరు చేయాల్సిన పని.. రెండు కలిసి ఒకటైతే.. 175కి 175 కొడతామన్నది వాస్తవం' అని సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. గతేడాది మే నెలలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం సమీక్షించినప్పుడల్లా దాని పురోగతిపై ఏ ఎమ్మెల్యే ఎలా తిరిగారనే పూర్తి వివరాలతో చర్చించేవారు.
‘మీరు అసలు తిరగలేదు. 5 రోజుల్లోపు తిరిగారు. 10నుంచి 15 రోజులే తిరిగారు. మీరు బాగానే తిరిగారు. చెప్పినంత సమయాన్ని పాటించలేదు’ అంటూ విభాగాలవారీగా ప్రతి ఎమ్మెల్యే పనితీరును లెక్కలు గట్టి మరీ అందరిముందే ప్రకటించేవారు. వెనుకబడినవారి పేర్లనూ చదివేవారు. ఫిబ్రవరి 13న నిర్వహించిన సమీక్షలోనూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఇలాగే ప్రకటించారు. వారి పనితీరు మెరుగుపరచుకోవాలని సీఎం హెచ్చరించారు. పనితీరులో మార్పులు లేని, మెరుగుపరచుకోని ఎమ్మెల్యేల స్థానంలో మే నెల తర్వాత కొత్త నియోజకవర్గ సమన్వయకర్తల నియామకం ఉంటుందని గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు.
సోమవారం నిర్వహించిన సమావేశంలో కూడా గతంలోలాగే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు సిద్ధం చేశారనే వార్తలొచ్చాయి. ఈ క్రమంలో పార్టీలో ఎవరి పరిస్థితి ఏంటో అనే సందిగ్ధంలోనే ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సమావేశానికి వెళ్లారు. అయితే వారు ఊహించినదానికి భిన్నంగా సీఎం ప్రసంగం సాగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసిన నేపథ్యంలోనే సీఎం ‘రాజకీయమంటే మానవ సంబంధాలు’ అనే కొత్త ఫిలాసఫీ చెబుతున్నారన్న చర్చకు దారితీసింది. గడపగడపకూ కార్యక్రమాన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు.ఈ నెల 13న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్న ఆయన.. వ్యక్తుల సమస్యలపై వారి వినతులను పరిష్కరించేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమస్యలు నేరుగా తనకే ఫోన్ చేసి చెప్పొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ‘జగనన్నే మన భవిష్యత్తు’ కార్యక్రమం ఈ నెల 7 నుంచి 20 వరకు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.