రామోజీ రావుకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి CM Jagan should apologize to Ramoji Rao: ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల పట్ల, ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావు పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ సీనియర్ నేతలు బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘాటుగా స్పందించారు. గతకొన్ని నెలలుగా రామోజీరావు పట్ల సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు.. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్లు ఉందని నేతలు వ్యాఖ్యనించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ప్రారంభమైన రోజు నుంచి ఈనాటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా ముందుకు సాగుతున్న మార్గదర్శిపై సీఎం జగన్ నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తీరు.. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్లుంది:విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పైశాచికత్వం ఇంకా తగ్గలేదనడానికి మార్గదర్శిపై వేధింపులే నిదర్శనమని ధ్వజమెత్తారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్లు.. రామోజీరావు పట్ల జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం చేతకాని సీఎం జగన్.. విశ్వసనీయత ఉన్న మార్గదర్శిపైనా అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.
సీఐడీకీ రామోజీ రావు భయపడేరకం కాదు:ఓ పెద్ద మనిషి పట్ల.. చేతిలో ఉన్న కీలుబొమ్మ లాంటి సీఐడీని పంపితే రామోజీ రావు భయపడే రకం కాదని స్పష్టం చేశారు. రామోజీ రావుపై బురదచల్లటం ముఖ్యమంత్రి సిగ్గులేనితనమని బండారు సత్యనారాయణ దుయ్యబట్టారు. మార్గదర్శికి తాను కూడా వినియోగదారుడునేనని.. లాభాలు కూడా వినియోగదారులే పొందుతారనటానికి తానే ఓ ఉదాహరణ అని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా పోరాడే వ్యక్తి కాబట్టే.. అన్ని పార్టీలు రామోజీ రావుని ప్రశంసిస్తాయన్నారు. సిగ్గుమాలిన పనులతో ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి దిగజారిపోయారని ఆక్షేపించారు. రామోజీ రావుని బ్లాక్‌మెయిల్ చేయటం కోసమే మార్గదర్శిపై హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. మార్గదర్శి మీద జగన్ మోహన్ రెడ్డి చేసే ఆరోపణలు ఆకాశం మీద ఉమ్మినట్లేనన్నారు. ప్రతిపక్ష నేతగా ఇదే జగన్ రెడ్డి అధికారం కోసం రామోజీ రావు కాళ్ళు పట్టుకోలేదా..? అంటూ బండారు సత్యనారాయణమూర్తి నిలదీశారు.
ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలి: తన చెడ్డ కోతి వనమంతా చెడకొట్టినట్లు మార్గదర్శి పట్ల జగన్ మోహన్ రెడ్డి తీరు ఉందని.. మాజీ మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పుట్టకముందే మార్గదర్శి ఉందని ఆయన గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టే.. ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శిపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శిపై తప్పుడు ఆరోపణలు జగన్ రెడ్డి పతనానికి నాందికి సంకేతాలని ఆయన గుర్తు చేశారు. మార్గదర్శి ఎండీ శైలజ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అపలేకుంటే ముఖ్యమంత్రి పదవికి జగన్ మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి