CM JAGAN MEET WITH DGP AND SAJJALA: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు (నిన్న) పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో వివేకానంద రెడ్డి హత్య కేసులో సహనిందితుడిగా ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ చేర్చడంతో.. అధికారులు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు వస్తే, ఆ సమయంలో రాజకీయంగా ఎలా స్పందించాలి..? ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలి..? అనే విషయాలపై పార్టీ నేతలతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈరోజు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
డీజీపీతో సీఎం జగన్ భేటీ..వివరాల్లోకి వెళ్తే.. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ సహనిందితుడిగా చేర్చింది. దీంతో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు వస్తే ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. ఈ భేటీలో డీజీపీతోపాటు ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సీబీఐ ముందు విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకావాల్సి ఉండడంతో..రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకి, సజ్జలకి సూచించారు. ఒకవేళ సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని గనక అరెస్టు చేసే అవకాశం వస్తే.. పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాం, కార్యాచరణపై సజ్జలతో సీఎం జగన్ చర్చించినట్లు తెలిసింది.