CM Jagan Meets MLAs on Ticket:ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపు గుర్రాల పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఇంఛార్జ్‌ల మార్పు కసరత్తు అధికార వైఎస్సార్సీపీలో వేడిరాజేస్తోంది. సర్వేల పేరుతో ఇప్పటికే రెండు దఫాలుగా 38 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చిన సీఎం జగన్, మరికొంత మందిని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ తీరుపై అసంతృప్తి గళాన్ని విప్పుతున్నారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన నేతల్లో కొందరు అధిష్ఠానంపై బాహాటంగానే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏనాడు పార్టీ గీతను దాటని తాము, తమ నియోజవర్గాలకు ఎందుకు దూరం కావాలని ఆవేదనకు గురయ్యారు.
CM Jagan Exercises on In-charge Changes: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకీ రాజీనామా చేసిన రోజు మొదలుకొని ఈరోజు వరకు సీఎం జగన్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పుపై కసరత్తులు కొనసాగుతూనే ఉంది. గత సంవత్సరం (డిసెంబర్ 12, 2023)న 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను మార్చుతూ మొదటి జాబితాను విడుదల చేసిన సీఎం జగన్, జనవరి 2, 2024న 27 మందితో కూడిన రెండవ జాబితాను విడుదల చేశారు. దీంతో 38 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జిలను ప్రకటించారు.
మరిన్ని మార్పులు ఖాయమంటున్న వైసీపీ అధిష్ఠానం - తాడేపల్లిలో చర్చోపచర్చలు
YSRCP Chief Leaders Came to CMO:నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు పరంపరలో భాగంగా శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మరికొంతమంది నేతలకు పిలుపు వచ్చింది. దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. అనంతరం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.
YSRCP Leaders Fire on CM Jagan: ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 38 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మార్చడంతో సీఎం జగన్‌పై పార్టీ శ్రేణులు, నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మార్చేందుకు సిద్ధమవ్వడంతో ఈసారి ఎవరెవరిని మార్చబోతున్నారని నేతలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇన్నాళ్లూ పార్టీ, వైఎస్ జగన్ కోసం పని చేసిన తమకు టికెట్లు ఇవ్వడలేదంటూ అసంతృప్తి ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.