CM Jagan meeting with Party Leaders: రాబోయే సాధారణ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా.. విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. సమావేశాలకు గ్రామస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు మినహా మిగిలిన అన్ని స్థాయిల్లో నేతలు తరలివచ్చారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్... వైసీపీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టాల్సిన పలు కార్యక్రమాలను, పార్టీ నేతలు అనుసరించాల్సిన కార్యాచరణను ప్రకటించి దిశానిర్దేశం చేశారు.
రాబోయే రోజుల్లో ప్రధానంగా నాలుగు కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోన్న జగనన్న ఆరోగ్య సురక్ష వాటిలో మొదటి కార్యక్రమమని సీఎం తెలిపారు. పేదలకు మంచి వైద్యాన్ని చేయి పట్టుకుని అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి 6 నెలలకు ఓ సారి ఈ తరహా క్యాంపులు కొనసాగుతాయని జగన్ తెలిపారు. వ్యాధి నయమయ్యే వరకు ఉచితంగా వైద్యం, మందులు ఇస్తామన్నారు. ప్రజలకు మరింత సేవ, మంచి చేసేందుకే "వై ఎపీ నీడ్స్ జగన్" కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి డిసంబర్ 10 వరకు 40 రోజులపాటు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలంతా మండలంలోని ప్రతి సచివాలయాన్ని సందర్శించాలని జగన్ ఆదేశించారు. 1 కోటి 60 లక్షల ఇళ్లలోని ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలియజేయాలన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు బోర్డులు ఆవిష్కరించి, ప్రతి గ్రామంలో వైసీపీ జెండా ఎగుర వేయాలన్నారు.
అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు 60 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర మూడో కార్యక్రమంగా చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. మూడు ప్రాంతాల్లో ని 175 నియోజకవర్గాల్లోనూ తిరిగేలా బస్సు యాత్రలు నిర్వహించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయాలని, యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నేతలు పాల్గొనాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం మూడు ప్రాంతాల నుంచి 3 బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర పేరిట నాలుగో కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే ఈ క్రీడా సంబరాల్లో పార్టీ నేతలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఇకపై ప్రతి ఏటా నిర్వహిస్తామన్నారు. ఈనెల 25 నుంచి జనవరి 15 వరకు ఈ నాలుగు రకాల కార్యక్రమాలు చేపడతామని, వీటిలో ప్రతి ఒక్క పార్టీ నేత భాగస్వామ్యమై, ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ విజయవంతం చేయాలని సీఎం నిర్దేశించారు.