CM Jagan on Volunteers Ki Vandanam: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంక్షేమ సారథులు వాలంటీర్లేనని అని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా కేవలం సేవ చేయాలనే తపనతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని సీఎం ప్రశంసించారు.
ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సత్కరించారు. ప్రభుత్వ పెన్షన్లను 64లక్షల మంది లబ్దిదారులకు అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు వాలంటీర్లను జగన్ కొనియాడారు. 2019 నుంచి 2లక్షల 66వేల మంది వాలంటీర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్లు ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నారని కొనియాడారు.
"రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసే ప్రతీ మంచి పనికి, ప్రతీ సంక్షేమ పథకానికి, ప్రతీ మేలుకు సారథులు, వారధులు, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితిని వాలంటీర్ల ద్వారానే జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నా. తులసి మొక్క లాంటి వ్యవస్థే.. ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత మేలు చేస్తుందో వివరించే నైతికత కూడా కేవలం మీ సొంతం మాత్రమే. దాదాపు 25 రకాల పథకాలకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ప్రతి గడప దగ్గరకు వెళ్తున్నారు. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తున్నది సేవ మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం"-వైఎస్ జగన్, ముఖ్యమంత్రి