Kommareddy Pattabhiram fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. బినామీ కంపెనీలను అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి.. వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. దోచుకున్న ఆ అవినీతి సొమ్ముతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీటర్లు బిగించే ప్రక్రియ సామాన్యమైనది కాదు: ఈ సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ..''జగన్ డీపీటీ స్కీం గురించి ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని అనుకుంటున్నాను. మీటర్లు బిగించే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ వ్యవహారం వెనక.. కొన్ని వేల కోట్ల కుంభకోణానికి సీఎం జగన్ తెరలేపుతున్నారు. గతంలో ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలను మనం విన్నాము, వివిధ పేపర్లలో చదివాము. జగన్‍కి సంబంధించిన బినామీ కంపెనీలకే దాదాపు రూ.13-14 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ఏపీఎస్‌పీడీసీఎల్‌కు సంబంధించి ఈ మధ్యనే మరోసారి టెండర్లను పలిచారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్‌కి సంబంధించి, మీటర్ల బిగింపుకు సంబంధించి ఆర్టీఎస్ పథకం కింద టెండర్లు పిలిచారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. ఈ మీటర్లు బిగించే ప్రక్రియ అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక్క డిస్కమ్ ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలో రూ.4,592 వేల కోట్లు.. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి సంబంధించినవి. ఎంపీ అవినాశ్ రెడ్డి గురించి సీఎం జగన్.. 'మై ఓన్ కజిన్ బ్రదర్' అంటూ చెప్పాడు. అవినాశ్ రెడ్డికి అత్యంత స్నేహితుడే విశ్వేశ్వర రెడ్డి. ఇక, షిర్డిసాయి ఎలక్ట్రిక్సల్ కంపనీతోపాటు ఇటీవలే మెస్సర్స్ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కుడా తీసుకొచ్చారు. కన్‌స్ట్రక్షన్స్ కంపనీకీ, విద్యుత్ టెండర్లతో పని ఏంటి?.'' అని ఆయన అన్నారు.