Clap Auto Drivers Problems: జగనన్న స్వచ్ఛ సంకల్పం.. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అన్న లక్ష్యంతో 2021 అక్టోబర్ రెండో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 4,097 చెత్త సేకరణ వాహనాలను.. జెండా ఊపి ప్రారంభించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే ఆరోగ్యకర సమాజం రూపొందించగలమని ఊదరగొట్టారు. సేకరించిన చెత్తతో బయో గ్యాస్, వర్మీ కంపోస్టు ఎరువుల తయారు చేస్తామన్నారు. ప్రమాదకరమైన వ్యర్థాల నిర్మూలనకు అధునాతన పరికరాలను వాడుతామన్నారు.
ఇదంతా నాణేనికి ఒక వైపే.. రెండో వైపు రెండో వైపు క్లాప్ ఆటో డ్రైవర్లుఅనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మున్సిపాలిటీలు, నగరల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలన్న లక్ష్యంతో క్లాప్ ఆటో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు గాను సుమారు 65 మున్సిపాలిటీల్లో క్లాప్ ఆటో వ్యవస్థను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. చెత్త సేకరణ బాధ్యత కొన్ని ప్రైవేటు ఏజన్సీలకు అప్పజెప్పింది.
CLAP DRIVERS : తక్కువ వేతనం చెల్లింపుపై క్లాప్ డ్రైవర్ల ఆవేదన
వారు ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమీ లేకుండా ఆటో డ్రైవర్లను నియమించుకున్నారు. రాష్ట్రంలో సుమారు 3వేల 500మంది క్లాప్ డ్రైవర్లు పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం క్లాప్ ఆటోల్లో డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి కనీసం వేతనాలు అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వేతనాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే వేతనాలను కూడా సమయానికి ఇవ్వడం లేదని క్లాప్ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారులు, ఏజన్సీలకు చెందిన కొంతమంది పెద్దలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు 15వేల నుంచి 18వేల రూపాయల వేతనం ఇస్తామని ఏజన్సీల వారు చెప్పారని, తీరా ఉద్యోగంలో చేరాక కేవలం 10వేల 6వందల రూపాయల వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తమకు ఇస్తున్న పది వేల ఆరు వందల రూపాయల వేతనం నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో కొంత డబ్బు తీసుకొని తమకు కేవలం 9వేల 270 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. విశాఖపట్నం వంటి నగరాల్లో పని చేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లకు 15వేల రూపాయల వరకు వేతనాలు ఇస్తున్నారు.