Citizens For Democracy Round Table Meeting Updates:ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో 'రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలపై కేసులు' అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. వివిధ వర్గాలకు చెందిన బాధితులు తమ గోడును చెప్పుకున్నారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులతో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో చెప్పుకుంటూ అమరావతి మహిళలు కన్నీరుమున్నీరయ్యారు.
Nimmagadda Ramesh Kumar Comments: ''రాష్ట్రంలో విచ్చలవిడిగా పోలీసులు కేసులు పెడుతున్నారు. ఆ అంశంపై ఈరోజు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేస్తే కొందరిలో అసహనం కలుగుతుంది. నిరసన తెలియజేయకపోతే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?. చిన్న అంశాలకే ఐపీసీ సెక్షన్లతో కేసులు పెడుతున్నారు. దిగువస్థాయి వారిపై కేసులు పెడితే, స్వేచ్ఛగా ఎన్నికలు ఎలా జరుగుతాయి?. రాష్ట్రంలో నిరవధికంగా 30, 144 సెక్షన్లు ఎలా కొనసాగుతాయి?. త్వరలో బాధితులకు న్యాయ సలహాలు అందిస్తాం. ఏపీలో కొందరు అధికారుల దిగజారుడు నిర్ణయాల వల్ల దారుణమైన పాలన వ్యవస్థ చూడాల్సి రావటం చాలా బాధాకరం. రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎప్పుడూ లేవు'' అని ఏపీ మాజీ ఎన్నికల అధికారినిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
'శాసన నియమం- న్యాయవ్యవస్థ పాత్ర'పై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధుల సమావేశం
Nimmagadda Ramesh on Assembly Elections:రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని నిమ్మగడ్డ రమేశ్ పేర్కొన్నారు. ఎన్నికల తరుణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలన్నారు. తప్పులు చేసిన అధికారులు, సిబ్బంది తప్పించుకునే పరిస్థితి ఉండకూడదన్నారు. రాజ్యాంగబద్ధంగా పాలన చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ నిధులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడమేంటి అని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకమై, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని నిమ్మగడ్డ రమేశ్ పిలుపునిచ్చారు.
Amaravati Womens Comments: వైఎస్ జగన్ సీఎం అయ్యాక రైతులు, దళితులు, మహిళపై పెట్టకూడని కేసులు పెట్టి, దారుణంగా వేధిస్తున్నారని రాజధాని అమరావతి మహిళలు శిరీష, పావని, ఫరూఖ్, వరలక్ష్మిలు కన్నీంటి పర్యంతమయ్యారు. రాజధాని అమరావతి కోసం నాలుగేళ్లుగా అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడ్డామని గుర్తు చేశారు. రాజధాని మహిళలపై పట్టిన కేసుల విషయంలో జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. పోలీసులు లాఠీలతో కొట్టి, మోచేతులతో గుద్ది, రోడ్డుపై ఈడ్చుకెళ్లారని ఆవేదన చెందారు. అమరావతి రైతులను కుక్కలతో పోల్చారని, తనపై పోక్సో కేసు సహా 30కి పైగా కేసులు పెట్టారని అమరావతి మహిళ శిరీష కన్నీరు పెట్టుకున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగే వరకు తాము పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని అమరావతి మహిళలు శపథం చేశారు.