Citizens for Democracy Meeting Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ రాజకీయ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు సంస్కరణలు చాలా అవసరమని, ముఖ్యంగా బదిలీలు, అపాయింట్‌మెంట్‌లు సక్రమంగా జరిగితే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. అహం, రాజకీయ ఆవేశాలు పక్కనబెట్టి, పోలీసు యంత్రాంగాన్ని వాళ్ల పని వాళ్లను సక్రమంగా చేసుకునేలా స్వేచ్ఛను కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టమని నేతలు వ్యాఖ్యానించారు.
Nimmagadda Ramesh Kumar comments: ''నాకు పోలీసు వ్యవస్థపైనా అపారమైన గౌరవం, విశ్వాసం, నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు ఎంతో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా విధులు నిర్వర్తిసుంటారు. పై అధికారుల ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తారు. అందుకే ఈరోజు వ్యవస్థ ఇలా ఉంది. అయితే, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా ఒకరే అధికారంలో ఉండరు. ప్రజల ఆమోదం ఉన్నంతవరకే పాలకులు. పక్క రాష్ట్రంలో ఎన్నికైన సీఎం స్పష్టంగా చెప్పారు. 'మేం ప్రజా పాలకులం కాదు-ప్రజా సేవకులం' అని అది స్ఫూర్తిదాయకమైన మాట. అహం, రాజకీయ ఆవేశాలు పక్కనబెట్టాలి. పోలీసు యంత్రాంగం వాళ్ల పని వాళ్లు సక్రమంగా చేసుకునేలా స్వేచ్ఛ కల్పించాలి. మీకు కావాల్సిన పంథాలోనే యంత్రాంగం పనిచేయాలంటే మోజేష్ లాంటి మరణాలు పునరావృతమవుతూనే ఉంటాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం.'' అని ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు.
వైసీపీ పాలన అరాచకం - సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ రౌండ్టేబుల్లో బాధితులు