IPG App cheating : రకరకకాల స్కీములు, పెట్టుబడులపై ఆకర్షణీయ ఆదాయం అంటూ ఊదరగొట్టి భారీ మోసానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో వెలుగు చూసింది. 'ఐపీజీ' యాప్ పేరుతో విస్తృతంగా ప్రచారం చేసి కొన్ని వేల మందిని ఆ గ్రూపులో సభ్యులుగా చేర్చుకుని ఒక్కసారిగా బోర్డు తిప్పేశారు. ప్రస్తుతం విజయవాడలోని చిట్టినగర్‌కు చెందిన ఒక వ్యక్తి తాను మోసపోయినట్లు పోలీసులను ఆశ్రయించగా.. విజయవాడ పక్కనే ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇదే యాప్ పేరుతో జరిగిన మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చిట్టినగర్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఎక్కువ ఆదాయం రావడంతో ఆకర్షితుడై మరికొంత మందిని చేర్చారు. ఒక్కసారిగా యాప్ నిలిచిపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మీరు చేరండి.. మరికొంత మందిని చేర్చండంటూ.. ఈ స్కీమ్‌లో చేరే వారు ముందుగా 'ఐపీజీ' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిలో అప్పటికే సభ్యుడైన వ్యక్తి పర్యవేక్షణలో 800 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలి. ఇలా చేరిన వ్యక్తి మరి కొంత మందిని చేర్చాలి. ఇలా ఎంత మందిని చేరిస్తే అంత ఆదాయం. సభ్యులను ఆకర్షించేందుకు.. కొత్తగా చేరి మరికొంత మందిని చేర్చేవారికి ఆకర్షణీయమైన కమీషన్ చెల్లించేవారు. ఇలా కొంత మందికి మొదట్లోనే రూ. 1300 నుంచి రూ. 2 వేల వరకు కమీషన్ రావడంతో వారు కొత్త సభ్యులను చేర్చేందుకు ఉత్సాహం చూపారు.