Chaos in SAP Meeting: విజయవాడలో క్రీడాసంఘాలతో శాప్ ఏర్పాటు చేసిన సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మంత్రి రోజా హాజరైన ఈ సమావేశంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. అసభ్య పదజాలంతో దూషించారంటూ పలువురు ప్రతినిధులు నిరసనకు దిగారు. కాగా క్రీడాసంఘాల సమస్యలు తెలుసుకొని, అవసరమైన సౌకర్యాలు కల్పనల కోసం అభిప్రాయ సేకరణ కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో క్రీడాభివృద్దికి కావల్సిన మౌళిక సదుపాయాల కల్పన కోసం.. గుర్తింపుతో సంబంధం లేకుండా అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులూ హాజరు కావొచ్చంటూ, శాప్ ఆహ్వానాలను పంపింది. విజయవాడ ఇందిరాగాంధి స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా పలువురు అధికారులు హజరైయ్యారు. వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు హాజరై రాష్ట్రంలో క్రీడా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. అదే సమయంలో శాప్‌లోని కొందరు అధికారుల వల్ల.. క్రీడాకారులకు నష్టం జరుగుతోందని రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కేపీ రావు.. తన అభిప్రాయం వెలిబుచ్చారు.
ఈ క్రమంలో కేపీ రావు మాట్లాడుతున్న సమయంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్థార్థరెడ్డి ‘హూ ఆర్ యూ అంటూ గద్దించడంతో.. సమావేశంలో ఒక్కసారిగా వేడెక్కింది. ఈ దశలో.. సిద్ధార్థరెడ్డి అనుచరగణం కేపీ రావుపై దాడి చేసేందుకు పైకి దూసుకురావడంతో.. ఆగ్రహించిన కేపీ రావు, ఒక్కసారిగా తన నిరసనను వ్యక్తం చేశారు. రాయలసీమ రౌడీయిజం ఇక్కడ చూపించొద్దని, రౌడీయిజం పుట్టిన బెజవాడలోనే రౌడీయిజం చేస్తే ఊరుకోబోమని అని పేర్కొనడంతో.. సిద్దార్ధరెడ్డి మరింత రెచ్చిపోయినట్లు తెలిసింది. బూతులు తిడుతూ.. సిద్థార్థరెడ్డి అనుచరులు దాడికి యత్నించగా ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు దానిని అడ్డుకున్నారని. సిద్దార్థరెడ్డి కనీసం తన వయసుకైనా గౌరవం ఇవ్వలేదని వాపోయారు. సమావేశంలో జరిగిన రికార్డులను సీఎం పరిశీలించి సిద్ధార్థరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.