Chanumolu Venkata Rao Bridge Damaged: నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. విజయవాడలోని చనుమోలు వెంకట్రావుపై వంతెనైతే మరీ అధ్వానంగా తయారైంది. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే.. ఈ వంతెన ప్రమాదాలకు నిలయంగా మారింది. దీనిపై ప్రయాణిస్తుంటే నడుము నొప్పులతో అల్లాడుతున్నామంటూ వాహనదారులు వాపోతున్నారు. తాము ఇన్ని అవస్థలు పడుతున్నా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడలోకి రావాలంటే ఉన్న రెండు ప్రధాన మార్గాల్లో చనుమోలు వెంకట్రావు పై వంతెన ఒకటి. దీని నిర్మాణాన్ని 2009లో ప్రారంభించగా 2011నాటికి పూర్తయింది. అప్పటి నుంచి నిత్యం వేల మంది దీనిపై రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దీని నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ఈ పై వంతెన రహదారంతా గుంతల వలయంగా తయారైంది. రహదారిలోని ఇనుప చువ్వలు పైకి లేచి దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ఈ దారిగుండా రాకపోకలు సాగించేవారు.. వాటివల్ల ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Bridge Collapse in Srikakulam District: విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా.. కుప్పకూలిన వంతెన
విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారు ఈ వంతెనపైనే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు గజానికో గుంత ఏర్పడటంతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది. పగలు వెలుతురు ఉండటం వల్ల ఎలాగొలా ప్రయాణించినప్పటికీ.. రాత్రి సమయంలో మాత్రం గుంతలు కనపడక ప్రమాదాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ వంతెన బాగాలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని.. అయినప్పటికీ అధికారుల్లో ఎటువంటి చలనం రావడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వంతెనపై ప్రయాణించడానికి ప్రయాణీకులతో పాటు వాహన యజమానుల కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒకసారి మాత్రమే వాహనాలు రిపేరుకి వచ్చేవని.. ఈ గుంతల వల్ల నెలకి నాలుగు సార్లైనా వాహనాలు షెడ్‌కి వెళ్తున్నాయని వాపోతున్నారు. రోజంతా ఆటో నడిపి సంపాందించిందంతా.. రిపేర్లకే సరిపోతోందని వాపోతున్నారు.