Chandrayaan 3 Mission Soft Landing Success :ప్రపంచంలో ఏ దేశం సాధించని అరుదైన ఘనతను భారత్ సొంతం చేసుకుంది. ఏ దేశం అడుగు పెట్టని చందమామ దక్షిణ ధ్రువాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 విజయం (Chandrayaan-3 Lands on The Moon) సాధించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెట్టగానే శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల యావత్ భారతదేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఘన విజయంపై ప్రముఖలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు.
ఇది చారిత్రాత్మక ఘట్టం : గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైందని, బుధవారం చంద్రుని ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రతిష్టాత్మక సంఘటనను ప్రశంసించారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని, చంద్రయాన్-3 మిషన్ యొక్క అద్భుత విజయానికి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని, ఇది చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా, నిర్దేశించని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న ఏకైక దేశంగా భారత్‌ను నిలబెట్టిందని అబ్దుల్ నజీర్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను, చంద్రయాన్-3 మిషన్‌తో సంబంధం ఉన్న ప్రతి సభ్యుడిని గవర్నర్ అభినందించారు. వారు అంతరిక్ష చరిత్రను సృష్టించారని, వారి అంకితభావం, కృషి, పట్టుదలతో దేశం మొత్తం గర్విస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Chandrayaan 3 Landed on Moon : జయహో భారత్.. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్
చరిత్రను లిఖించారు : చంద్రయాన్-3 మిషన్ విజయవంతం చేసిన ఇస్రోకు శాస్త్రవేత్తలకుసీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ దేశానికి అద్భుతమైన క్షణం అని సీఎం జగన్ అన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో చరిత్ర సృష్టించిందని..చాలా సంంతోషంగా ఉందని, గొప్ప స్థాయికి నడిపిస్తూ చరిత్రను లిఖించారని ముఖ్యమంత్రి అన్నారు.
ఇక నుంచి ఎవ్వరూ ఆపలేరు : చంద్రుడిపై భారత్ నిలిచి చరిత్ర తిరగరాసిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుుడు అన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ఘనతను సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా అవతరించినందుకు ఇస్రోకి అభినందనలు తెలియజేశారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని చంద్రునిపైకి తీసుకెళ్లాలనే వారి అచంచలమైన స్ఫూర్తిని, సంకల్పానికి తన వందనం అని అన్నారు. ఇక నుంచి భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరని చంద్రబాబు నాయుుడు తెలిపారు.