CHANDRABABU OPEN LETTER TO PEOPLE : తాము చెప్పిందే రాజ్యాంగమనే గర్వంతో విర్రవీగుతున్న వైసీపీ నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెగించి పోరాడకపోతే వైసీపీ శ్రేణుల అకృత్యాలు ప్రతి ఒక్కరి ఇంటినీ చుట్టుముడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని.. లేదంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో అంబేడ్కర్ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు.
‘‘రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీగా తెదేపా చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలి. సీఎం జగన్ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి ఆంబేడ్కర్ రాజ్యాంగం రచించారు. ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోంది. అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారు"-చంద్రబాబు
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన: రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీగా తెదేపా చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి అంబేడ్కర్ రాజ్యాంగం రచించారన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని.. అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.