TDP Chief Chandrababu Naidu latest comments: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మైనార్టీలకు కీలక హామీలిచ్చారు. తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిన వెెంటనే ఎలాంటి నిబంధనలను అమలు చేయకుండానే దుల్హన్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి మండలం ధరణికోటలో నేడు ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. తెలుగుదేశం హయాంలో ముస్లింల కోసం చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు. అనంతరం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను అన్ని విధాలా మోసం చేశారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ''ప్రత్యేకంగా ఒక మైనార్టీ సదస్సును ఏర్పాటు చేయాలని, ఆ సదస్సు ద్వారా మైనార్టీల మనోభావాల్ని తెలుకోవాలని అనుకున్నాను. చివరిగా ఆ ఆలోచన ఈరోజుతో తీరింది. మైనార్టీల భవిష్యత్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా గతంలో ముస్లింల కోసం మనం ఏం చేశాము అనే విషయాలను ఒకసారి గుర్తు చేసుకుంటే.. మొదట్నుంచి ముస్లింకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూను రెండో భాషగా డిక్లేర్ చేసింది తెలుగుదేశం పార్టీనే. కార్పొరేషన్‌ను తీసుకొచ్చి ఆదుకున్నది తెలుగుదేశం పార్టీనే. నవ్యాంధ్రప్రదేశ్‌లో హజ్ హౌస్‌లు కట్టించింది కూడా తెలుగుదేశం పార్టీనే. కర్నూలులో ఉర్దూ వర్సిటీ పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీనే. ఇప్పుడు కొత్త కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఎటువంటి ప్రయోజనం లేకుండా చేశారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి నిబంధనలు లేకుండా దుల్హన్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. గతంలో ముస్లింలకు రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక వంటి పథకాలను ఇచ్చాం. రంజాన్ తోఫాను తీసేశారంటే వీళ్లను ఏమనాలి?, దుల్హన్ ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. తెలుదేశం ప్రభుత్వ హయాంలో 316 దర్గాలకు ఆర్థికసాయం చేశాం. దాదాపు 65 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాలకు ఆర్థికసాయం కూడా చేశాం. రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండా మసీదులకు పట్టా ఇప్పించే బాధ్యతను కూడా మాదే. స్వయం ఉపాధి కింద రూ.3 లక్షలు రుణాలను ఇప్పించింది కూడా తెలుగుదేశం పార్టీనే'' అని ఆయన అన్నారు.