Chandrababu Fires : ఒక్క సైకో వందల మంది సైకోలను తయారు చేయటంతోనే వైసీపీ నేతలను మనం కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఎంపీ రఘురామరాజు, సుబ్బారావు గుప్తాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రావణ కాష్ఠ పరిస్థితులు ఏర్పడిన.. లీగల్ సెల్ అందుకు ధీటుగా పనిచేస్తోందని వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్ సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన.. తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని చంద్రబాబు ఈ సదస్సులో అన్నారు. వైసీపీ అరాచకాలతో బతకలేమంటూ ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేసే హక్కుందన్నట్లు డీజీపీ స్థాయి అధికారులే మాట్లాడే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ధ్వజమెత్తారు. వివిధ ఘటనల్లో న్యాయవాదులు చేసిన కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.
గడిచిన నాలుగు సంవత్సరాలలో తెలుగుదేశం శ్రేణులపై నమోదు చేసిన అక్రమ కేసులపై సదస్సులో చర్చించారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రభుత్వ అడ్డంకులను సమావేశంలో గుర్తు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అనుసరించవలసిన విధానాలపై సమీక్షించారు. వైసీపీ నేతల దాడుల్లో బాధిత కుటుంబాలు పడ్డ ఇబ్బందులను వారు సదస్సులో వివరించారు. అంతేకాకుండా లీగల్ సెల్ అందించిన సాయాన్ని బాధితులు గుర్తు చేసుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవాన్ని ఎమ్మెల్సీ ఆనంతబాబు కారులో తీసుకువచ్చిన తీరును సదస్సులో గుర్తు చేసుకుని అతని తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు.
పొలిటికల్ రౌడీయిజాన్ని భూ స్థాపితం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఒక్క విశాఖలోనే 40వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని.. ఇలాంటి పరిస్థితిలో పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే ఉంటే.. ప్రజలకు భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారుల్ని బోనెక్కించకుండా వదలనని ఆయన హెచ్చరించారు. అన్ని శక్తులు కూడగట్టుకుని చేసే పోరాటంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి అమరావతిపై అసత్య ఆరోపణలు చేసాడని ఆరోపించారు. నరేగా పనులు చేసిన వారికి బిల్లులు ఇప్పించటంలోనూ న్యాయవాదుల కృషి కీలకమని అభినందించారు. న్యాయవాదుల కృషి లేకుంటే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేవారని అన్నారు.