AP new Governor Justice Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో గవర్నర్‌గా రేపు జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యలో జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం నేతల బృందం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
నేతలందరినీ రాష్ట్ర ప్రథమ పౌరుడికి తెలుగుదేశం అధినేత పరిచయం చేశారు. గవర్నర్‌గా తాను లెర్నర్ అని... ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటున్నానని నేతలతో జస్టిస్ అబ్దుల్ నజీర్ సరదాగా మాట్లాడారు. నేతలతో పరిచయం అనంతరం చంద్రబాబుతో గవర్నర్ విడిగా దాదాపు 40నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర తాజా పరిస్థితులపై నూతన గవర్నర్‌తో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న వివిధ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని చంద్రబాబు ఈ మేర గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.