Chandrababu health condition: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తి స్థాయి ఆరోగ్య నివేదిక జైలు అధికారులు ఇంకా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టు ను ఆశ్రయించారు. తమకు కూడా ఇప్పటి వరకు ఫిజికల్ డాక్యుమెంట్ ఇంకా అందలేదని న్యాయస్థానం తెలిపినట్లు వారు తెలిపారు. ఆ కారణం గా సమగ్ర వైద్య నివేదిక తాము ఇవ్వలేక పోతున్నామని న్యాయస్థానం వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
డాక్టర్ల సూచనలను సమగ్రంగా తెలిపే నివేదిక ఇవ్వడం లేదు: ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో ఆందోళన పెరుగుతోంది. జైలు అధికారులను లిఖిత పూర్వకంగా కోరినా నివేదిక ఇవ్వకపోవడంపై... చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12 వ తేదీ తరువాత నిర్వహించిన పరీక్షలకు సంబంధించి నివేదికను జైలు అధికారులు బయటకు ఇవ్వలేదు. నివేదిక లో పేర్కొన్న అంశాలను దాచి పెట్టి హెల్త్ బులిటెన్ ఇవ్వడంపై పార్టీ నేతలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేసారు. ఆరోగ్య పరిస్థితి, డాక్టర్ల సూచనలను సమగ్రంగా తెలిపే నివేదిక ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము నిర్ధేశించిన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ అధికారులు హెల్త్ బులిటెన్ ఇస్తున్నారని కుటుంబ సభ్యులు ధ్వజమెత్తారు. అసమగ్రంగా హెల్త్ బులిటెన్ ఉండడం, కుటుంబ సభ్యులు అడిగినా చంద్రబాబు ఆరోగ్యంపై వైద్య నివేదిక ఇవ్వకపోవడంపై పార్టీ నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కు చల్లని వాతావరణం కల్పించాలనే డాక్టర్ల సూచనలను దాచి పెట్టి నాలుగు రోజుల క్రితం హెల్త్ బులిటెన్ అధికారులు ఇచ్చారని నేతల మండిపడుతున్నారు. వైద్యుల నివేదిక బయట పడడం, దాని ద్వారా కోర్టుకు వెళ్లడంతో ఎసి ఏర్పాటు కు న్యాయంస్థానం ఆదేశాలు ఇచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.