CBN FIRES ON POLICE OVER AYYANNA ARREST : తెదేపా నేత అయ్యన్నపాత్రుడి అక్రమ అరెస్ట్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో భూకబ్జాలపై పోరాడితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. వైకాపా అరాచక పాలనకు పరాకాష్టే.. అయ్యన్న అరెస్టు అని ధ్వజమెత్తారు.
భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్‌ది: జలవనరుల శాఖ ఈఈని బెదిరించి తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని ఆగ్రహించారు. వివేకా హత్యకేసులో సాక్ష్యాలు తారుమారుపై సీఐ శంకరయ్య సీబీఐకి తొలుత వాంగ్మూలం ఇచ్చారని.. ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారన్న బాబు.. జలవనరుల శాఖ అధికారి అయ్యన్నపై ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇలాంటిదేనని పేర్కొన్నారు. అయ్యన్న తాత నుంచి ఆ కుటుంబానికి మచ్చలేని 60 ఏళ్ల రాజకీయాల చరిత్ర ఉందన్న బాబు.. భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్‌దని విమర్శించారు. ఇడుపులపాయలో వందల ఎకరాలు వైఎస్ కుటుంబం ఆక్రమించుకుందని.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రభుత్వ స్థలం కబ్జా చేసి.. వైఎస్ సీఎం అయ్యాక క్రమబద్ధీకరించుకున్నారని ఆరోపించారు. జగన్ మేనమామ వాగు ఆక్రమించి థియేటర్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం, రుషికొండ అంశం నుంచి దృష్టి మళ్లించడానికే అయ్యన్నను అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఆ కుటుంబ అక్రమాలపై చర్యలు తీసుకుంటారా?: వైఎస్ కుటుంబ అక్రమాలపై ఫిర్యాదు చేస్తాం.. చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. హత్య చేసిన అవినాష్‌కు అభయం ఇస్తున్నారు కానీ.. ఉత్తరాంధ్ర కబ్జాలను ప్రశ్నించిన అయ్యన్నను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కుతారా? అని నిలదీశారు. పోలీసులు తాగి గోడలు దూకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కొంతమంది కళంకిత అధికారులు తప్పుడు విధానాలతో వెళ్తున్నారని.. వారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.