Chandrababu_Arrest_Tension_in_AP Chandrababu Arrest Tension in AP :టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. నిరసన తెలుపుతున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు అర్ధాంతరంగా బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల హై అలర్ట్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు. టీడీపీ నేతల కదలికలపై నిఘా ఉంచి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ఇతర ముఖ్య నేతలను హౌస్ (TDP leaders House Arrested )అరెస్టు చేశారు. వారి ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. ఎవరినీ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. మరికొందరు ముఖ్య నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసుస్టేషన్లకు తరలించారు. నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జ్ బంగారాజు, పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, నియోజకవర్గ ఇంఛార్జ్ విజయచంద్రను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు
Tension in AP: సాలూరులో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణిని, రాజాంలో మాజీ మంత్రి కళా వెంకటరావు, శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని గృహనిర్భంధం చేసారు. టీడీపీ నేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్వతీపురం, విజయనగరం, పాలకొండ, రాజాం, సాలూరు, శృంగవరపుకోట ఆర్టీసీ డిపోల్లో బస్సులను నిలివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులు నిలిపివేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉన్న ఫలంగా ఆర్టీసీ బస్సులు నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నెల్లూరు :టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. అల్లీపురంలోని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసానికి తెల్లవారుజామునే భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు సోమిరెడ్డి నివాసం వద్దే నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన సోమిరెడ్డి, వైసీపీకి రాజకీయంగా ఊరి ఖాయమని అన్నారు.
సత్యసాయి జిల్లా :చంద్రబాబు అరెస్టుపై సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దిష్టిబొమ్మ దహనం చేయాలని ప్రయత్నించారు. దిష్టిబొమ్మ దహనం చేయడానికి అడ్డుకున్న పోలీసులు సవితను, టీడీపీ శ్రేణులు అరెస్టు చేసి పెనుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శ్రీకాకుళం :శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. మరికొంత మందిని పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, శ్రీకాకుళం టీడీపీ నేత పీరికట్ల విఠల్‌ను అరెస్ట్ చేసి..కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
నంద్యాల :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేయడం అనైతికమని టీడీపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో టీడీపీ నాయకులు శాంతియుతంగా నిరసన నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేయనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా రాయదుర్గం పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను అధికారులు డిపోలోనే నిలిపివేశారు. తమ అధినేత చంద్రబాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక అకారణంగా పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ నేతలు, నాయకులు మండిపడ్డారు.
చంద్రబాబుకు అనారోగ్యం.. అయినా ఆగని అరెస్టు... జగన్ సైకో పాలనపై నిరసనలు
కోనసీమ జిల్లా :కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులను తెల్లవారుజాము నుండే ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల బుచ్చిబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్, నాగిడి నాగేశ్వరరావులతో పాటు పలువురు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లా :మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలానే నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలలో కార్యకర్తలు ధర్నాలు నిరసనలు చేయకుండా పోలీసులు ఎక్కడిక్కడ భద్రత ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజామున మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బాపట్ల జిల్లా :బాపట్ల జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు పోలీసులు నోటీసులు అందజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నాయకులను బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. ఎవరు బయటకు రాకుండా నేతల ఇళ్ల వద్ద పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో పలువురు నేతలను బయటకు రానీయకుండా పోలీసులు గృహా నిర్భంధం చేశారు. యద్దనపూడి మండల పార్టీ అధ్యక్షుడు రంగయ్య చౌదరి, అద్దంకి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగినేని రామకృష్ణ, మన్నం త్రిమూర్తులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
రాజాం :తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ కిమిడి కళావెంకటరావుని ముందుగా హౌస్ అరెస్ట్ చేయడానికి రాజాంలో ఉన్న ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే పోలీసు చేరుకుని కళాను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ చేతకాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఇటువంటి చర్యలు మానుకోవాలని కళా హెచ్చరించారు.
Live Updates : నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారు: చంద్రబాబు
అల్లూరి సీతారామరాజు జిల్లా :అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని వేకువజాము నుంచి మహిళా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బయటకు రావడానికి ప్రయత్నించిన ఆమెను పోలీసుల అడ్డుకున్నారు. సీఐఎస్ఐఎల్ బృందం మార్గంలోనే అడ్డుకొని అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్టు నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించారు పోలీసులు నాయకుల ఇళ్ల వద్దకి వెళ్లి అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైకో పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు నాయుడు అరెస్టుతో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు అన్నారు.
విజయనగరం జిల్లా : విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇంచార్జ్ కర్రోత్ బంగారు రాజును పోలీసులు తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. క్షణాల్లోనే అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇలాంటి నీచమైన సంస్కృతికి పాల్పడడం వైసీపీ ప్రభుత్వానికి తగదని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలిచి తీరుతుందని ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదంటూ బంగారు రాజు ఆవేదన వ్యక్తం చేశారు.