వైసీపీ పాలనలో దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయి: సీపీఐ రామకృష్ణ CPI State Secretary Ramakrishna: వైసీపీ పాలనలో దళితులు, మైనారిటీలు, బీసీ నేతలపై దాడులు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ ఛలో విజయవాడకి పిలుపునిచ్చారు. విజయవాడకు వెళుతూ ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎం సొంత జిల్లాలో జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే సీఎం ఎందుకు మౌనం వహిస్తున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. తన డ్రైవర్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుకు పాలాభిషేకాలు చేస్తున్నారంటే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. సాంకేతిక కారణాల వల్ల తమ పార్టీకి జాతీయ హోదా రద్దయిందని.. త్వరలోనే దానిని సాధిస్తామని రామకృష్ణ చెప్పారు.
ఛలో విజయవాడకు తరలివచ్చిన నాయకుల అరెస్ట్.. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్షాలు, దళిత మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా దళిత, మైనార్టీ సంఘాలు వామపక్షాల నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలు మైనారిటీలపై దాడులు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛలో విజయవాడకు తరలివచ్చిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
జగన్కు ఆత్మహత్యే శరణ్యం..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఇప్పుడు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రైవేట్ పరంచేయాలని చూస్తున్నారని.. అందు కోసం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని రామకృష్ణ ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ, జగన్ కలిసి విశాఖ ఉక్కును అదానికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు కోసం బిడ్డింగ్ వేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ కూర్చుంది. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిశీలించడానికి కేసీఆర్ తన బృందాన్ని పంపిస్తుందన్నారు. విశాఖ ఉక్కు కోసం చిన్న రాష్ట్రమైన తెలంగాణ బిడ్డింగ్ వేస్తే ఇక జగన్కు ఆత్మహత్యే శరణ్యం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పటికైనా జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని అన్నారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా దళితులపైన, మైనార్టీలపై జరుగుతున్న దాడులను.. హత్య కాండను నిరసిస్తు.. ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం.. ఇటీవలనే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప జిల్లాలో జిల్లా స్థాయి అధికారి అచ్చన్నను దారుణంగా హత్య చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. అదే విధంగా పంచనామా కూడా వారి కుటుంబానికి చెప్పలేదు. వాస్తవాలు వెలుగులోకి రావాలి అంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి.. తన డ్రైవర్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుకు పూల దండలు వేస్తున్నారు తప్ప ఏలాంటి చర్యలు చేపట్టలేదు.- రామకృష్ణ, సీపీఐ, రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: