Renuka Chaudhary fire on CM Jagan: ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ ఉంది?.. అమరావతి రైతులు ఎంతో క్రమశిక్షణగా, ఎన్నో రోజుల నుంచి నిరసన తెలుపుతున్నప్పటికీ.. కనికరించేలేని కఠిన మనస్సు ఉన్న జగన్‌కు.. రాజకీయాలు ఏం తెలుసు? రౌడీయిజంతో అందరిపైనా దాడులు చేస్తూ.. రాష్ట్రంలో ప్రగతి అనేదే కనిపించని పరిస్థితిలో ఇవాళ ప్రజలను వేధిస్తూ.. పేదలను వెక్కిరించేలా రోజుకో పథకం అంటున్నారే తప్ప.. అభివృద్ది మాత్రం ఒక్కటి లేదు.. బంగారంలాంటి రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు'' అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ పర్యటనకు విచ్చేసిన ఆమెకు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకగా.. కొద్దిసేపు ఆమె రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మహిళలు, రైతులు శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసన తెలియజేసినా వారికి న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఆమె దుయ్యబట్టారు. ఏమైనా అంటే కులాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారని.. సీఎం జగన్ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.