Central Election Commission Warning to Officials :ఏపీలో ప్రలోభాలకు ఆస్కారం లేని స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించడం, అనర్హులకు చోటు లేకుండా చేయటం, జాబితాలో ఉన్న వారందరూ ఓట్లేసేలా చూడటం తమ ప్రధాన లక్ష్యాలని వివరించారు. ఏపీలో ఎన్నికల యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, కొంతమంది ఎన్నికల సిబ్బంది, బీఎల్‌వోలు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులందాయనిరాజీవ్‌కుమార్ చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాముల్ని చేయొద్దని కొన్ని పార్టీలు కోరాయన్నారు.
2024 Election in AP :రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా చూడాలని కోరటంతో పాటు ఓటర్ల జాబితాపై అనుమానాల్ని వ్యక్తం చేశాయని చెప్పారు. కొన్ని ఫిర్యాదులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, మిగతా వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సంసిద్ధతపై రెండు రోజుల పాటు అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2024 ఏడాదిలో తొలిసారి మీడియా సమావేశాన్ని ఏపీతోనే ప్రారంభించామని ఆయన వెల్లడించారు.
రాజకీయ నాయకులకు తలొగ్గితే తప్పుకోవాల్సిందే - అధికారులకు సీఈసీ స్వీట్ వార్నింగ్!
ఎపిక్ కార్డులు డౌన్‌లోడ్ : ఓట్ల తొలగింపు, గంపగుత్తగా ఓట్లు చేర్చడం, సున్నా డోర్ నంబరుతో భారీగా ఓట్ల నమోదుపై కొన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై మరింత పర్యవేక్షణ పెంచాలని, ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరాయి. నకిలీ ఓట్లు వేసేందుకు వీలుగా కొందరు భారీగా ఎపిక్ కార్డులు డౌన్‌లోడ్ చేస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చాయి. రాష్ట్రంలో ప్రత్యేకంగా పోలీసు పరిశీలకుల్ని నియమించాలని, పారా మిలటరీ బలగాల్ని పంపించాలని కోరాయి.
ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటుహక్కు :"ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా, ఎలాంటి గొడవలు జరగకుండా జరిపేందుకు ఈసీ పూర్తిగా కట్టుబడి ఉంది. ఎన్నికల సిబ్బంది, ఉన్నతాధికారులంతా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అన్ని పక్షాలకు సమాన స్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశాం. అది వారి బాధ్యత. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదు. పోలింగ్‌కు వెళ్లే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌కు బదులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటుహక్కు వినియోగించుకుంటారు."-రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్
నిబంధనలు స్పష్టం :ఏపీలో 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30 మధ్య 21 లక్షల ఓట్లు తొలగించామన్న సీఈసీ పునః పరిశీలన అనంతరం వాటిలో 13 వేల 61 ఓట్లు అర్హమైనవని తేలటంతో వాటిని పునరుద్ధరించామన్నారు. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓటర్లు 14.48 లక్షల మంది ఉన్నట్లు ఫిర్యాదులు అందగా పరిశీలించి 5.65 లక్షల ఓట్లను తొలగించామన్నారు. ఒకే డోర్ నంబరుతో 10 అంతకు మించి ఓట్లున్న నివాస గృహాలు 1.57 లక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాటిలో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. గతేడాది అక్టోబరు 27న ముసాయిదా జాబితా విడుదల చేసే నాటికే ఆ నివాసాల సంఖ్యను 65 వేల964కు, వాటిలోని ఓటర్ల సంఖ్యను 9.49 లక్షలకు తగ్గించగలిగామన్నారు.
సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై ఏపీ అధికారులతో సీఈసీ భేటీ
వీరిలో 4.52 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లిన వారు కాగా 26,679 మంది ఆచూకీ తెలియదన్నారు. మిగతా వారు ఆయా నివాసాల్లోనే ఉంటున్నట్లు తెలిపారు. సున్నా, అసంబద్ధ సంఖ్యల్ని డోర్ నంబర్లుగా కలిగిన ఇళ్లు 2.52 లక్షలున్నట్లు గుర్తించి ఆ చిరునామాల్ని సరిచేశామన్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రతి తొలగించిన ఓటునూ తనిఖీ చేశామన్న సీఈసీ ఫిర్యాదు చేసిన ప్రతీ పార్టీకి స్వయంగా సమాధానాలు ఇచ్చామని తెలిపారు. రెండు ఓట్లు ఉండటం నేరమన్న సీఈసీ అన్నారు. తెలంగాణాలో ఓటు వేసిన వ్యక్తులు ఏపీలోనూ ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని ఓటరుగా ఉండాలంటే స్థానికంగా నివాసం ఉండాల్సిందేనని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు.
వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం :"అర్హులు ఎవరైనా సరే ఓటు హక్కు పొందాలనుకునే చోట సాధారణ నివాసితుడిగా ఉంటే ఓటరు కావొచ్చు. అలా కాకుండా ఒక ప్రాంతంలో ఆస్తులున్నంత మాత్రాన అక్కడ ఓటరు కాలేరు. ఎవరికైనా సరే రెండు ఓట్లు ఉంటే అది నేరం. ఆస్తులు, వారసత్వంగా వచ్చిన ఇళ్లు ఉండి స్థానికంగా నివాసం ఉండకపోతే ఓటరు కాలేరు. ఇలాంటి వివరాల్ని దాచిపెడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఎంతకాలమైతే నివాసం ఉంటే సాధారణ నివాసితుడిగా పరిగణిస్తామో అంతకాలం ఉన్నవారిని ఓటరుగా పరిగణిస్తాం. ఈ దశలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ ఎన్నికలు, ఇక్కడ ఓట్ల సవరణ జరిగి ఎక్కువ కాలం కాలేదు. నామినేషన్ల వరకూ నిరంతరం ఓట్ల సవరణ చేస్తారు కాబట్టి తెలంగాణ నుంచి వచ్చిన వారిని ఓటరుగా చేర్చేటపుడు జాగ్రత్తగా పరిశీలించి సాధారణ నివాసితుడో కాదో చూడాలి."-రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్
జనవరి 22న ఓటర్ల తుది జాబితా :ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.07 కోట్లుగా ఉందని పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ ఉన్నట్టు సీఈసీ వెల్లడించారు. 46 వేల పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక సజావుగా నిర్వహించేలా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు ఇళ్ల వద్ద నుంచి ఓటువేసేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. నోటిఫికేషన్ విడుదలైన అయిదు రోజుల తర్వాత వారు ఫాం-12డీలో దరఖాస్తు చేస్తే సరిపోతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేమనుకునే వయో వృద్ధులు, దివ్యాంగులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్ధులు కేసుల వివరాలను ప్రకటించాలని వాటిని సుప్రీం కోర్టుకు సమర్పిస్తామని సీఈసీ తెలిపారు. జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామన్నారు.
"శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి - వారు ఎన్నికల పక్రియకు హాని"