Central Election Commission Team Visit Vijayawada :ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, తమకు అనుకూలంగా భారీగా దొంగ ఓట్లు చేర్చడాన్ని అధికార పార్టీ ఉద్యమంలా కొనసాగిస్తోంది. బీఎల్వోలుగా (BLO) వ్యవహరిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పెత్తనం చలాయిస్తూ తాము అనుకున్నట్లు ఓటర్ల జాబితా తయారయ్యేలా పన్నాగం అమలు చేస్తోంది. వీటన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ బృందం ఈనెల 9, 10 తేదీల్లో విజయవాడలో పర్యటించనుంది. అన్నిజిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రెండు రోజులు సమీక్ష జరపనుంది. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది.
ECI Officers to Visit State on January 9th :టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు లేకుండా చేశారు. దశాబ్దాల తరబడి ఒకేచోట ఉండేవారి పేర్లు తీసేశారు. బతికున్నవారి ఓట్లు గల్లంతు చేసి చనిపోయిన వారివి కొనసాగించారు. ఒకే కుటుంబంలో కొందరి ఓట్లు ఒక పోలింగ్ కేంద్రంలో, మరికొందరివి వేరే కేంద్రంలో చేర్చారు. తప్పుడు సమాచారంతో అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు చేయించారు. ఉరవకొండ, పర్చూరు, విశాఖ తూర్పు, గుంటూరు పశ్చిమ, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి అక్రమాలు అనేకం వెలుగు చూశాయి.
దొంగ ఓట్లపై వైసీపీ గురి - ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలు
Irregularities in Voter list : పర్చూరులో తప్పుడు సమాచారంతో ఫాం-7లు పెట్టిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదులిచ్చినా పట్టించుకోలేదు. చివరికి ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప బాధ్యులపై కేసులు నమోదు చేయలేదు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుదీ ఇదే పరిస్థితి. ఉరవకొండలో ఓట్ల తొలగింపుపై పయ్యావుల కేశవ్ దిల్లీ వెళ్లి సీఈసీకి ఫిర్యాదిస్తే తప్ప కదల్లేదు.
Fake Votes : వైఎస్సార్సీపీకి అనుకూలంగా వేలసంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు. తిరుపతి నియోజకవర్గంలో 38,396 మంది ఓటర్లు శాశ్వతంగా వెళ్లిపోయినా వారి పేర్లు మాత్రం జాబితాలోనే ఉన్నాయి. చంద్రగిరిలో ఇలాంటివి 12,074 ఓట్లున్నాయి. చంద్రగిరిలో కొత్తగా ఓటు నమోదుకు 9 నెలల్లో 50వేల ఫాం-6లు పెట్టారు. తమిళనాడు వాసులను ఇక్కడ చిరునామాలతో ఓటర్లుగా చేర్పించారు.