ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాటికాపరుల మహా ధర్నా.. అడ్డుకున్న పోలీసులు.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం - katikaparula demands

Cemetery Ground Keepers Dharna: డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాటికాపరుల సంఘాలు మహా ధర్నాకు పిలుపునిచ్చాయి. విజయవాడలో కాటికాపరుల సంఘాలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు.. ముత్యాలంపాడు కర్మల భవనం పార్కు వద్ద ఆందోళన చేసుకోవాలని సూచించారు. దీంతో ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ల నెరవేర్చకపోతే క్షేత్రస్థాయి నుంచి ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Cemetery Ground Keepers Dharna
కాటికాపరుల మహా ధర్నా

By

Published : Mar 20, 2023, 6:05 PM IST

Cemetery Ground Keepers Dharna: తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాటికాపరులు, బేగరు గుంతలు తీసే కూలీలు సంఘం, కుల వివక్షత పోరాట సమితి ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వారిని రైల్వే స్టేషన్, బస్టాండ్​లలో అడ్డుకున్న పోలీసులు.. విజయవాడ ముత్యాలంపాడు కర్మల భవనం పార్కు వద్దకు తరలించి.. అక్కడే ఆందోళన చేసుకోవాలని.. హుకుం జారీ చేశారు.

కర్నూలు జిల్లా నుంచి విజయవాడ వచ్చిన కాటికాపర్లను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలపై కాటికాపర్లు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని చెప్పినా వినిపించుకోలేదు. నగరంలో చలో అసెంబ్లీ, అంగన్వాడీ వర్కర్ల ధర్నాలు ఉన్న నేపథ్యంలో.. వారిని పోలీసుల అడ్డుకున్నారు. రైల్వేస్టేషన్ బయటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రోడ్డుపైనే కూర్చోబెట్టి కఠినత్వం చాటుకున్నారు.

దీంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కాటికాపరులు, బేగరుల సంఘం నాయకులు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి.. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తమకు అనేక సౌకర్యాలు కల్పించాలని, ఇతర ఉపాధి కల్పన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా కాటికాపరుల సంఘం నాయకులు ప్రకటించారు.

తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించకుంటే.. త్వరలో సీఎం నివాసాన్ని ముట్టడించి అక్కడ శవంతో ధర్నా చేయడానికి కూడా వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. ముందస్తుగా తమ ఆందోళన కార్యక్రమానికి గాంధీనగర్ ధర్నా చౌక్​లో అనుమతించిన అధికారులు.. ఇవాళ ఉదయం రద్దుచేసి.. ఇలా తమని ఇబ్బందులకు గురి చేయటం తగదని పోలీసులపై కాటికాపరుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిమాండ్లను పరిష్కరించాలని.. కాటికాపరుల మహా ధర్నా

"నేడు కాటికాపరులుగా చేస్తున్న వారి పిల్లలు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈ రోజు అనేక సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని పనిచేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చి.. ఉద్యమానికి అనుమతి కోరాం. అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. రద్దు చేశారు. ఇది దుర్మార్గపు చర్య. సమస్యలను పరిష్కరించకుంటే.. రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం". - కాటికాపరి, బేగరుల సంఘం రాష్ట్ర నాయకులు

"ఈ రోజు వివిధ జిల్లాల నుంచి కాటికాపరులు, బేగరులు, గుంతలు తీసేవాళ్లు వచ్చారు. న్యాయమైన డిమాండ్ల కోసం.. విజయవాడకు అనేక కష్టాలు పడి వచ్చారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన కాటికాపరులను.. ఒక నియంతలా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. నడి రోడ్డుపై కూర్చోపెట్టారు. ఇలాంటి చర్యలు చేయడం.. ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటని తెలియజేస్తున్నాం. కాటికాపరుల సమస్యలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు. కాటికాపరుల ప్రధాన సమస్యలైన.. కాటికాపరులను నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆత్మగౌరవంతో బతికేందుకు రెండు ఎకరాల పొలం, ఇల్లు నిర్మించి ఇవ్వాలి". - కాటికాపరి, బేగరుల సంఘం రాష్ట్ర నాయకులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details