Candidates Opinions on the Police Constable Exam: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నేతృత్వంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష ఈరోజు పూర్తయింది. రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ రాతపరీక్ష పై అభ్యర్ధులు భిన్నాబిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. చదువుకునేందుకు ఎక్కువ సమయం ఇవ్వలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ తర్వాత పరీక్ష రాసేందుకు మధ్య ఉన్న గడువును పెంచితే బాగుండేదని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోలేదని అభ్యర్ధులు తెలిపారు.
కొందరు విద్యార్ధులు పది గంటల తర్వాత పరీక్షా కేంద్రం వద్దకు వచ్చారు. సమయం ముగియటంతో వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో నిరాశతో అభ్యర్ధులు వెనుదిరిగారు. విజయవాడ సిద్ధార్ధ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని అధికారులు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. 40 పట్టణాల్లో 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. 90 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఎస్సై పోస్టులకు రాత పరీక్ష నిర్వహించిన తర్వాత కానిస్టేబుల్ రాత పరీక్షలో అర్హులైన వారికి దేహధారుడ్య పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాత పరీక్ష కీ ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ఆన్లైన్లో ప్రశ్నించవచ్చన్నారు.