CAG revealed by AP budget details: రాష్ట్ర బడ్జెట్ తయారీ, నిర్వహణ తీరు తెన్నులను కాగ్ తప్పుబట్టింది. సరైన ముందస్తు అంచనాలు లేకపోవడం, కొన్నింటిలో నిధులు మిగిలిపోతే, మరికొన్నింటిలో నిధులు చాలకపోవడం, చివర్లో నిధులను సరెండర్ చేయడం, బడ్జెట్‌లో కేటాయింపుల్లేకుండా ఖర్చు చేయడం.. ఇలా అనేక లోపాలను బయటపెట్టింది. పటిష్ఠ బడ్జెట్ నిర్వహణకు రాబడులు, ఖర్చుల ముందస్తు ప్రణాళిక, కచ్చితమైన అంచనాలు అవసరమని... అయితే కొన్నిచోట్ల కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు పెట్టారని.. మరికొన్నిచోట్ల కేటాయింపులను ఖర్చుపెట్టక పోయేసరికి నిధులు మిగిలిపోయాయని తేల్చింది. ఇది ఖర్చుల పర్యవేక్షణ, నియంత్రణ లోపాలను సూచిస్తోందని పేర్కొంది.
కేటాయింపులు, ఖర్చులకు మధ్య వ్యత్యాసాలకు కారణాలను సంబంధిత నియంత్రణాధికారులు వివరించలేదన్న కాగ్...ఇది ప్రభుత్వంలోని జవాబుదారీతనానికి సంబంధించిన యంత్రాంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ప్రజాధనం వినియోగంపై విధానపరమైన నియంత్రణను బలహీన పరుస్తుందని ఆక్షేపించింది. బడ్జెట్ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించిన కాగ్...పలు అంశాలను ప్రస్తావించింది. 2021-22లో ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా 2వేల 812కోట్ల 79 లక్షలు ఖర్చు చేసినట్లు స్పష్టం చేసింది. అంతకు ముందు 2020-21లోనూ ఇదేవిధంగా ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా 741 కోట్ల 66 లక్షలు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై ప్రభుత్వ సమాధానం ఆమోదయోగ్యంగా లేదని కాగ్ పేర్కొంది. ఆడిట్ పరిశీలనను పరిగణనలోకి తీసుకుంటూ, భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కానివ్వబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది రాబడులు, వ్యయాల మధ్య తాత్కాలిక అసమతూకాన్ని ఆపే సదుపాయమని... రాబడుల్లో అంతరాన్ని తీర్చేందుకు రాష్ట్రానికి సహాయపడుతుందని కాగ్ పేర్కొంది. అయితే 2021-22లో ప్రభుత్వం 139 రోజులపాటు డబ్ల్యూఎంఏను ఆశ్రయించిందని... 164 రోజులపాటు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించిందని...ఇది పేలవమైన నగదు నిర్వహణ సామర్థ్యాన్ని.. రాబడులు, వ్యయాల అవాస్తవ అంచనాలను సూచిస్తోందని కాగ్ ఆక్షేపించింది. 2021-22లో 2 లక్షల 34 వేల 657 కోట్ల 40 లక్షల వాస్తవ కేటాయింపులకు అదనంగా ప్రభుత్వం లక్షా 37వేల 788 కోట్ల 47 లక్షలు అనుబంధ కేటాయింపులు చేసింది. ఈ కేటాయింపుల్లో లక్షా6వేల 205 కోట్ల 59 లక్షలు మొత్తం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ల చెల్లింపుల కోసం కేటాయించినట్లు పేర్కొంది. వాస్తవికంగా లేని ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు ఉండటం..పేలవమైన వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ, పథకాలు అమలు పరచడంలో బలహీనమైన నియంత్రణల వల్ల... అభివృద్ధి కారక అంశాలకు అవసరమైన దానికంటే తక్కువ కేటాయింపులు జరుగుతున్నట్లు కాగ్ పేర్కొంది. కొన్ని శాఖల్లో అధికంగా మిగుళ్లు ఏర్పడటంతో, నిధులు అవసరమున్న ఇతర శాఖలు వాటిని పొందలేకపోతున్నాయని ఆక్షేపించింది.