BRS Chief KCR Video Message to BRS Workers and Fans : హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తనను చూసేందుకు దయచేసి యశోద ఆసుపత్రికి రావద్దని వేడుకున్నారు. కార్యకర్తలు వందలాదిగా రావడం వల్ల ఆసుపత్రిలోని వందలాది మంది రోగులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకు వస్తానని ఆసుపత్రిని వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
'నన్ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు' - కేసీఆర్ వీడియో సందేశం "దయచేసి సహకరించండి. ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపడం లేదు. ఎవరూ యశోద దవాఖానాకు రాకండి. తన ఆరోగ్యం పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి తరలివచ్చిన ప్రజలకు విజ్ఞప్తి. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటాను. అప్పటిదాకా అందరూ సంయమనం పాటించండి. ఎవరూ యశోద దవాఖానాకు రావొద్దు. ఎందుకంటే తనతో పాటు వందలాది మంది పేషెంట్లు ఆసుపత్రిలో ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు."-కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్‌ను పరామర్శించిన మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు :మరోవైపు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పలువురు నేతలు పరామర్శించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేసీఆర్‌ను కలిశారు. మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉన్నారని, మరో రెండు, మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మరో మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా సహకరించాలని కేసీఆర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. రాజకీయం పరంగా కేసీఆర్‌కి ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని సుపరిపాలన అందించేందుకు తమకు అందించాలని కోరామని మంత్రులు వివరించారు.
కేసీఆర్‌ను కలిసిన అక్బరుద్దీన్ ఒవైసీ : మరోవైపు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఉదయం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. మరోవైపు సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి పలువురు పార్టీ కార్యకర్తలు సైతం యశోద ఆసుపత్రికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వారిని కలిసి మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు.