ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 2, 2023, 7:44 AM IST

ETV Bharat / state

స్వాధీనం చేసుకున్న వాటిని తిరిగిచ్చేలా ఆదేశించండి: బ్రహ్మయ్య అండ్‌ కొ

Telangana High Court: ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్‌ కొ విజ్ఞప్తి చేసింది. తమ భాగస్వామి కోటేశ్వరరావును గత నెల 28 మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 29వ తేదీ 5 గంటల వరకూ సీఐడీ అధికారులు తమ నియంత్రణలో ఉంచుకోవడంతో సమాచారం సేకరించలేకపోయామన్నారు.

Etv Bharat
Etv Bharat

Telangana High Court : ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్‌ కొ విజ్ఞప్తి చేసింది. తమ కార్యాలయంలో సోదాల నిమిత్తం ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు బ్రహ్మయ్య అండ్‌ కొ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. గత వారం అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు పూర్తి సమాచారం అందుబాటులో లేదని తెలిపింది.

తమ భాగస్వామి కోటేశ్వరరావును గత నెల 28 మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి 29వ తేదీ 5 గంటల వరకూ సీఐడీ అధికారులు తమ నియంత్రణలో ఉంచుకోవడంతో సమాచారం సేకరించలేకపోయామన్నారు. కార్యాలయంలో సోదాల నిమిత్తం 30 నుంచి 35 మంది వచ్చినా, ఇద్దరే యూనిఫాం వేసుకున్నారని మిగిలిన వారు మఫ్టీలో వచ్చారని బ్రహ్మయ్య అండ్‌ కో సంస్థ తెలంగాణ హైకోర్టుకు వివరించింది. స్థానిక పోలీసులు ఎవరూ లేకుండా ప్రవేశించి బలవంతంగా ఇంటర్నెట్‌, సీసీటీవీ కనెక్షన్లను కట్‌ చేశారని తెలిపింది.

ఏపీ పోలీసులకు ఇక్కడ సోదా చేసే పరిధి లేదని అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కార్యాలయంలో ఉన్నవారందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. మార్గదర్శి సమాచారాన్ని ఇస్తామని చెబుతున్నా పట్టించుకోకుండా కంప్యూటర్లలోని సమాచారాన్ని కాపీ చేసుకుని, రికార్డులను స్వాధీనం చేసుకున్నారని తెలియజేసింది.

సీఐడీ జారీ చేసిన సోదా ఉత్తర్వులు ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబధించినవే తప్ప మార్గదర్శి చట్టబద్ధ ఆడిటర్‌ పాత్రకు చెందినవి కావని తెలిపింది. కంపెనీ చట్టం కింద మార్గదర్శికి చెందిన ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ను రూపొందించడమే మా బాధ్యతని చిట్‌ఫండ్‌ కింద ఎలాంటి ఆడిట్‌ నిర్వహించట్లేదని పిటిషన్‌లో పేర్కొంది.

సమాచారం తీసుకెళ్లిన వ్యక్తి అరెస్టు :మార్గదర్శి సమాచారాన్ని సమర్పించాలంటూ సీఐడీ అదనపు ఎస్పీ మార్చి 18న నోటీసు జారీ చేశారని, అయితే ఆర్థిక సంవత్సరాంతం కావడంతో మూడు వారాల గడువు కావాలని కోరినట్లు బ్రహ్మయ్య అండ్‌ కొ వారికి తెలిపింది. దీనికి వారు నిరాకరించడంతో 28న ఉదయం 10 గంటలకు శ్రావణ్‌ ల్యాప్‌టాప్‌తో విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లగా ఆయనతో పాటు వెళ్లిన రజత్‌ను నిర్బంధించి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని వివరించింది.

29న శ్రావణ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారని తెలిపింది. సమాచారం ఇచ్చినా హైదరాబాద్‌ కార్యాలయంలో బలవంతంగా సోదాలు ప్రారంభించారంది. ముగ్గురు భాగస్వాములు, 18 మంది ఉద్యోగులను నిర్బంధించి ఫోన్లను జప్తు చేశారని, మహిళా ఉద్యోగులను సాయంత్రం 5 గంటలకు, మధుమేహం ఉన్న ఒక భాగస్వామిని సాయంత్రం, మరొకరిని రాత్రి వదిలి పెట్టారన్నారని తెలిపింది. 80 ఏళ్ల కోటేశ్వరరావు ఆరోగ్యాన్నీ పట్టించుకోకుండా సోదాలు పూర్తయ్యేదాకా వారితోనే ఉంచుకున్నారని వివరించింది.

మార్గదర్శివే కాకుండా, ఖాతాదారులందరికీ చెందిన 12 ల్యాప్‌టాప్‌లు, 2 డేటా బ్యాకప్స్‌, 7 డెస్క్‌టాప్‌లలోని సమాచారాన్ని ఏపీ సీఐడీ అధికారులు కాపీ చేసుకున్నారంది. మార్గదర్శితో సంబంధం లేని డాల్ఫిన్‌ హోటల్స్‌, ఉషోదయ ఎంటర్‌ ప్రైజెస్‌, ఉషోదయ పబ్లికేషన్స్‌, ఈటీవీ, మార్గదర్శి ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ లీజింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, ఎల్‌.చిమన్‌లాల్‌ ఇండస్ట్రీస్‌లకు చెందిన సమాచారాన్ని తీసుకెళ్లారని తెలిపింది.

పంచనామాలో తప్పులు :సోదాల తర్వాత రూపొందించిన పంచనామాలో తప్పులుండటంతో అందులో సంతకం చేయడానికి కోటేశ్వరరావు నిరాకరించారన్న బ్రహ్మయ్య అండ్‌ కో సంస్థ పంచనామా కాపీని ఇవ్వడం గానీ, వదిలిపెట్టి వెళ్లడం గానీ చేయలేదని తెలిపింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 165, 166లకు విరుద్ధంగా సోదాలు జరిగాయని తెలిపింది. చట్ట ప్రకారం కేసుతో సంబంధం ఉన్న వివరాలను తీసుకెళ్లాలని, దానికి విరుద్ధంగా సంబంధం లేని వాటిని, ఇతర ఖాతాదారుల సమాచారాన్ని తీసుకెళ్లారని సంస్థ తెలిపింది.

అందువల్ల ప్రధాన పిటిషన్‌లోని అభ్యర్థనను సవరించడానికి అనుమతించాలని, తీసుకెళ్లిన సమాచారాన్ని కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. లేనిపక్షంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. సోదా నోటీసులను రద్దు చేయాలని కోరింది. దీనిపై ఏపీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటరు దాఖలు చేస్తామనడంతో విచారణను ఈ నెల 13కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details