Bonda Umamaheshwar Rao : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు పోలీసులు సృష్టించిన అడ్డంకులపై.. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పక్షాలు సైతం ఈ చర్యపై మండిపడుతున్నాయి. ఇప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విజయవాడలో నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవటంపై బోండా ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో.. విజయవాడలోని సాంబమూర్తి రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహనికి వినతిపత్రం అందించారు. రాబోయే ఏడు నెలల తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని బోండా ఉమా అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంకుశంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించటం దుర్మార్గమని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేశ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు.