MLAs Poaching Case Update: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారంలో సిట్ ఎదుట బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ విచారణకు హాజరుకానున్నారు. వీరి విచారిస్తే కొత్త విషయాలేమైనా వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా సంతోశ్ విచారణకు రావాల్సి ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నలుగురిలో ఎవరెవరు సిట్ ముందుకు వస్తారనేది తేలాల్సి ఉంది. ఈ నెల 29లోపు కేసు దర్యాప్తులో పురోగతిని హైకోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో కీలక ఆధారాల్ని సేకరించాలని సిట్ భావిస్తోంది.
ప్రణాళిక సిద్ధం..: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలను బీజేపీలో చేరాలంటూ ప్రలోభపెట్టేందుకు యత్నించారనే అభియోగాలపై గత నెల 26న రామచంద్రభారతి, సింహయాజీ, నంద కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన క్రమంలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నలుగురికి నోటీసులు జారీ చేశారు. వీరికి సంధించేందుకు ప్రశ్నావళిని సిట్ ఇప్పటికే రూపొందించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మంతనాలు సాగించిన రోజు రామచంద్రభారతి.. తన ఫోన్ నుంచి తుషార్‌తో మాట్లాడారు. పైలట్ రోహిత్రెడ్డితోనూ మాట్లాడించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అంశంలో తుషార్‌కు గల సంబంధంపై విచారించనున్నారు.