BJP Leader Lanka Dinakar on Indosol Solar Pvt Ltd: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 'ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ (షిర్డిసాయి ప్రమోటర్లకు చెందిన) సంస్థ'కు రూ.80 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వరకు నిధులను కేటాయించి పవర్ లైన్, సబ్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ఈ ప్రైవేట్ సంస్ధకు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రోత్సాహకాలను ప్రకటించిందని దుయ్యబట్టారు. సీఎం జగన్ తన సొంత జాగీరులా అస్మదీయ కంపెనీలకు ట్రాన్స్‌కో నిధులు దోచిపెడుతూ ప్రజల నెత్తిన ఛార్జీల రూపంలో పిడుగులు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
Lanka Dinakar Press Meet Updates: 'అస్మదీయుల కోసం ప్రభుత్వ ఖజానా లూటీ-ప్రజలపై విద్యుత్తు ఛార్జీల శిరోభారం' అనే అంశంపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇండోసోల్ సోలార్ అనే ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయించి, విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేసి, ప్రాజెక్టు గ్రౌండింగ్ చేయడానికి అవసరమయ్యే మద్దతు, మైనింగ్ పాటు ఫిజికల్ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థలకు ఉచిత కానుకగా నిధులు అందజేస్తోన్న ఈ జగన్ ప్రభుత్వం కరెంట్ దుర్వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయగలదా? అని ఆయన నిలదీశారు.
Lanka Dinakar Comments: ''వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ఉచితంగా నిధులు అందజేస్తోంది. తద్వారా విద్యుత్తు లైన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేయిస్తోంది. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం మెయిన్ లైన్ నుంచి ప్లాంట్ వరకు అవసరమైన లైన్లకు అయ్యే వ్యయం వినియోగదారుల నుంచే వసూళ్లు చేస్తారు. కానీ, ఈ ముఖ్యమంత్రి తనకు నచ్చిన కంపెనీలకు ఆ వ్యయాన్ని ప్రభుత్వం ఖజానా నుంచి భరించే కొత్త పద్దతిని తీసుకొచ్చారు. పారిశ్రామిక ప్రోత్సాహకంగా ఇండస్ట్రీయల్ పాలసీ ప్రకారం వినియోగించిన విద్యుత్ శక్తిపై మాత్రమే పరిశ్రమలకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. పవర్ లైన్, సబ్ స్టేషన్ నిర్మాణాలపై కాదు'' అని లంకా దినకర్ అన్నారు.