Bhavishyathu Ku Guarantee Bus Yatra:భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటుగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు, విధ్వంసాన్ని జనాలను వివరించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అలాగే ఈ యాత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎక్కడికక్కడ ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.
విజయవాడ.. రాణిగారి తోటలో తెలుగుదేశం నిర్వహించిన చైతన్య రథయాత్ర ఆంక్షల నడుమ ఘనంగా జరిగింది. అనుమతిచ్చిన సమయం దాటిపోయిందంటూ సభను కొనసాగించడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత మరోచోట సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో పరిస్థితి చల్లారింది. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై తెలుగుదేశం నేతలు నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో కార్మికులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 160 స్థానాల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.
పార్వతిపురం మన్యం జిల్లా.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన 100 పడకల ఆసుపత్రిని ఇప్పటికీ పూర్తి చేయకపోవడంపై.. తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నరకం చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ రాష్ట్ర స్పీకర్ ప్రతిభా భారతి మాట్లాడుతూ మద్యపానం నిషేధము అని మేనిఫెస్టోలో వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ ఇప్పుడు అతనే దగ్గరుండి గవర్నమెంట్ మందు షాపు అని పెట్టుకొని అతని సొంత బ్యాంక్ ఖాతాలను సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. సాలూరు నియోజకవర్గంలో గిరిజన ఉపముఖ్యమంత్రి ఉన్నారు కానీ గిరిజనులకు ఎటువంటి న్యాయము జరగట్లేదని అన్నారు.
కోనసీమ జిల్లా.. ముమ్మిడివరం నియోజవర్గంలోతెలుగుదేశం బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. జగన్ పాలనలో రాష్ట్రం 30ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని.. ఆ పార్టీ నేత దాట్ల బుచ్చిబాబు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్తు గ్యారెంటీ బస్సు యాత్ర సోమవారం ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రవేశిస్తున్న సందర్భంగా నియోజవర్గంలోని తాళ్ళరేవు.. ఐ పోలవరం.. కాట్రేనికోన.. ముమ్మిడివరం మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.. అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ప్రతి అంశాన్ని ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించాలని.. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు.. ప్రతిపక్షాల కార్యకర్తలపై పెడుతున్న కేసులు అడ్డుకునేందుకు ప్రతి కార్యకర్త సంసిద్ధంగా ఉండాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న టీడీపీ చైతన్య రథయాత్రలు.. అన్నమయ్య జిల్లాలో.. తెలుగుదేశం చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్ర మదనపల్లికి చేరుకుంది. యాత్రలో భాగంగా తిరుపతి రోడ్డులోని టిడ్కో ఇళ్ల సముదాయం, మెడికల్ కళాశాల నిర్మాణ పనులను నాయకులు పరిశీలించారు. వేసవిలో నీటి ఎద్దడి నుంచి మదనపల్లికి రక్షణ కోసం గతంలో 90శాతం పూర్తయైన నీటి నిల్వల ట్యాంక్ పనులు నేటికీ పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.