Bejawada Bar Association met the Governor: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని నెలలుగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో.. మార్గదర్శి ఆడిటర్ అరెస్ట్ నుంచి మొదలుకొని నేటిదాకా లాయర్లపై జరుగుతున్న దాడుల గురించి, న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించామని.. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు. దీంతోపాటు న్యాయవాదులకు సీఐడీ అధికారులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన అంశాన్ని కూడా తెలియజేశామన్నారు.
ప్రొటెక్షన్ బిల్లు తీసుకురావాలి.. న్యాయవాదులను రక్షించాలి నిరహార దీక్షలు-నిరసన కార్యక్రమాలు .. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుందర్ మీడియాతో మాట్లాడుతూ..''మార్గదర్శి ఆడిటర్ అరెస్ట్‌పై తమ అభిప్రాయాలను గవర్నర్‌కు సవివరంగా తెలియజేశాం. న్యాయవాదులకు సీఐడీ అధికారులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరాము. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి.. హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నాం. మైనింగ్ మాఫియాల ఫోటోలు తీసిన న్యాయవాది బత్తిన హరిరామ్‌పై స్థానికుల ముసుగులో కొందరు ఏప్రిల్ 22న దాడి చేశారు. న్యాయ వ్యవస్థపై, లాయర్లపై రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి గవర్నర్‌కు తెలిపాం'' అని ఆయన అన్నారు.
గవర్నర్..సానుకూలంగా స్పందించారు.. అనంతరం ఈ రెండు సంఘటనలపై గవర్నర్.. సానుకూలంగా స్పందించి.. న్యాయం చేస్తానని న్యాయవాదులకు హామీ ఇచ్చారని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుందర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల విషయంలో.. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకొచ్చి..దేశవ్యాప్తంగా ఉన్న లాయర్లను రక్షించాలని గవర్నర్‌ను కోరామన్నారు. న్యాయవాదుల విషయంలో సీఐడీ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని గవర్నర్‌కు తెలియజేశామన్నారు.
న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటాం..సీఐడీ పోలీసులు ఆంధ్ర రాష్ట్రంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని.. బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు.. ఏ పని పడితే ఆ పని చేయటం.. ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయటమే లక్ష్యంగా ముందకెళ్తున్నారని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా న్యాయవాదుల విషయంలో వెనకాముందు ఆలోచించకుండా కేసులు పెట్టి, నోటీసులు జారీ చేస్తున్నారని గుర్తు చేశారు. మార్గదర్శి విషయంలో ఆడిటర్‌పై కేసులు పెట్టి.. జైలుకు పంపిన ఘటన రాష్ట్ర ప్రజలందిరికీ తెలుసన్నారు. ఆ తర్వాత కొంతమంది లాయర్లు కలిసి ఒక ఫోరంగా ఏర్పడి.. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి.. అందులో సీఐడీ పోలీసులు తీరుపై చర్చించి.. పలు కీలక విషయాలను తెలియజేస్తే.. చివరికి తమకే నోటీసులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ విషయాలన్నింటీపై ఈరోజు గవర్నర్‌ను కలిసి స్పష్టంగా తెలియజేశామన్నారు. న్యాయవాదులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చదవండి