BC Students Suffer as govt Fails on hostel management: బీసీలంటే బ్యాక్‌వార్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్.! బడుగుల ఓట్ల కోసం సభలల్లో ఇలా డైలాగ్‌లు కొట్టే జగన్, బీసీ బిడ్డల్ని గాలికొదిలేశారు.! తలుపుల్లేని గదులు, అక్కరకురాని మరుగుదొడ్లు, దుప్పట్లు లేక వణుకుతున్న పిల్లలు.! ఇలా వసతిగృహాలు ఒక్కటైనా చక్కగా ఉంటే ఒట్టు.! రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లను పరిశీలిస్తే అవి వసతి గృహాలో? గోదాములో అర్థంకాని పరిస్థితి. మేనమామనంటూ మాటల్లో మమకారం తప్ప చేతల్లో ఉపకారం చేయడం లేదని, పిల్లలు వాపోతున్నారు.
అనకాపల్లి జిల్లా, కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట బీసీ సంక్షేమ వసతి గృహంలో 87 మంది పిల్లలు ఉంటే ఐదు స్నానపుగదులు, మరుగుదొడ్లున్నాయి. ఒక్కదానికీ తలుపుల్లేవ్. ఇక కిటీకీలైతే టూరింగ్ టాకీస్ కంతల్లా కనిపిస్తున్నాయి. పిల్లలు నిద్రపోయే గది కిటికీకి తలుపులు కాదుకదా కనీసం ఐరన్ మెష్ కూడా లేదు. పిల్లలే పాతదుప్పటి కట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మంచాలు లేకపోవడంతో నేల మీదనే నిద్రిస్తూ చలికి వణుకున్నారు.
విజయనగరం బీసీ కళాశాల వసతిగృహం: ఇక విజయనగరం బీసీ కళాశాల విద్యార్ధుల వసతి గృహ భవనం చూస్తే! జగన్ బొమ్మతో పెట్టిన ఈ బ్యానర్ తప్ప ఇక్కడంతా శిథిలావస్థకు చేరింది. ఈ స్విచ్ బోర్డు ఎప్పట్నుంచో ఇలా ప్రమాదకరంగా మారినా, మార్చాలనే ఆలోచనే లేదు! పాత ప్లెక్సీలు, పాత దుప్పట్లే ఇక్కడి కిటికీలకు తలుపులు. మంచినీళ్లైతే, పిల్లలే టిన్‌లు పట్టుకుని తెచ్చుకోవాల్సిందే. విజయనగరంజిల్లాలో 53 బీసీ వసతి కేంద్రాలుంటే 15వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మరో 15కేంద్రాలు నాడు-నేడుకు ఎంపికైనా ఇంతవరకూ మరమ్మతు పనులే ప్రారంభించలేదు. పార్వతీపురం బాలుర బీసీ హాస్టల్ గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. మరుగుదొడ్లైతే, పాడుబడ్డ అవశేషాల్లా మిగిలాయి. పిల్లలు కాలకృత్యాల కోసం ఇలా పొలాల్లోకి వెళ్లాల్సిందే. స్నానాలు ఆరుబయట చేయాల్సిందే ! ఎంత చలైనా కటిక నేలపై పడుకోవాల్సిందే.
112 మంది విద్యార్థినిలు- 3 మరుగుదొడ్లు! సమస్యల వలయంలో ఉరవకొండ బాలికల వసతి గృహం
ఒంగోలు బీసీ కళాశాల వసతిగృహం:ఒంగోలులోని బీసీ కళాశాల వసతిగృహం ఎదుట డేంజర్ బోర్డుపెట్టడం మేలు. పిల్లలు బ్యాగులు పెట్టుకునే ఐరన్ ర్యాక్ ఇలా ఒరిగి ఎప్పుడు ఏ బడుగుబిడ్డ మీద పడుతుందో తెలియని పరిస్థితి. ఫ్యాన్ రాడ్ సీలింగ్‌కు వేలాడుతుంటే, ఫ్యాన్ ఇలా ఊడి మూలన పడింది. కరెంటు బోర్డైతే ఇలా ప్రమాదకరంగా తయారైంది. ఇక హైస్కూల్ పిల్లలుండే బీసీ బాలుర వసతి గృహంలో ఊడిన కరెంటు బోర్డు తాకొద్దని చేయొద్దని ఓ కాగితం అంటించి ఊరుకున్నారు. ఇక్కడ 90 మంది పిల్లలకు తొమ్మిదే మరుగుదొడ్లున్నాయి. గదికి ఒకే తలుపుంది. ఎండైనా, చలైనా అదే రక్షణ. గదులకు కిటికీలు పగిలిపోయాయి. జాలీలూ లేకపోవడంతో వర్షం పడితే జల్లు కొడుతోంది. దోమ తెరల‌్లేవు..! ఎప్పుడో ఇచ్చిన దుప్పట్లు చిరిగాయి. పడుకోడానికి ఇబ్బందిపడలేక...పిల్లలే ఇళ్ల నుంచి చాపలు తెచ్చుకున్నారు.