BC Leaders Leaving YSRCP: మైసూర్ బోండాలో మైసూర్ ఉంటుందా? ఈ ప్రశ్నే వింతగా ఉంది కదా? వైెఎస్సార్సీపీలో సామాజిక న్యాయం అంతకంటే విచిత్రంగా తయారైంది. బీసీల పేరు చెప్పుకొని జగన్ కోటరీలోని పెద్దలే పెత్తనం చెలాయిస్తున్నారు. ఓ వర్గం మితిమీరిన ఆధిపత్యాన్ని భరించలేక, రాజకీయంగా ప్రాధాన్యం దక్కక బడుగు, బలహీనవర్గాల నాయకులు పార్టీని వీడుతున్నారు.
వైఎస్సార్సీపీలో చెప్పే సామాజిక న్యాయాన్ని భరాయించలేక ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పార్టీని వీడారు. జనసేనలో చేరిన ఆయన వైఎస్సార్సీపీ కోసం ఆస్తులు అమ్ముకుంటే కనీసం తనను మనిషిలా కూడా చూడడం లేదని ఆక్రోశించారు. వ్యాపారాలను దెబ్బతీశారని, జగన్‌కు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని వంశీ కృష్ణయాదవ్ వైఎస్సార్సీపీకి గుడ్‌బై
చెప్పారు.
ఇలా వైఎస్సార్సీపీలో అనేక మంది బీసీ నేతలు ఉండలేక వెళ్లలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికి కారణం పార్టీలో ఒక ప్రధాన వర్గం మితిమీరిన ఆధిపత్యం. జగన్ అట్టహాసంగా ప్రకటించిన సామాజిక న్యాయ యాత్రలో రోడ్లపై తిరుగుతోంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు. కానీ అందులో ఎవరికి సీట్లు ఇవ్వాలో, ఎవరిని పక్కనపెట్టాలో నిర్ణయించేది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కూర్చునే పెద్దలే! పార్టీలో, ప్రభుత్వంలో పెత్తనం చెలాయించే ఒక ప్రధాన సామాజికవర్గ పెద్దలదే నిర్ణయాధికారం!
పార్టీ విధానాలు నచ్చనివారు బయటకు పోతుంటారు- అలాంటివారు ఉంటే పార్టీకి ఇంకా నష్టం: సజ్జల
ఒక సజ్జలరామకృష్ణారెడ్డి, ఒక విజయసాయిరెడ్డి, ఒక వైవీ సుబ్బారెడ్డి, ఒక ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఒక ధనుంజయరెడ్డి! అభ్యర్థుల జాబితా వీళ్లే సిద్ధం చేస్తారు. ఆ తర్వాత జగన్ ముందుంచుతారు. ఎంపీ మోపిదేవి వెంకట రమణకూ అలాగే జరిగింది. ఒకప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయనకు ఇప్పుడు నియోజకవర్గమే గల్లంతైంది. సొంత నియోజకవర్గం రేపల్లెలో మోపిదేవిని పక్కనపెట్టి, కొత్త వ్యక్తిని వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా తెచ్చారు.
మోపిదేవిని సీ.ఎమ్.వో కు పిలిచి ఆయనకు అవనిగడ్డలో అవకాశం ఇస్తాం అక్కడ పోటీ చేస్తూనే, రేపల్లెలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 'గెలవలేని వ్యక్తిని రేపల్లెలో పెట్టి, ఆయననూ గెలిపించమని మళ్లీ నాకే చెప్పడమేంటి?' అని మోపిదేవి నివ్వెరపోయారట. అదేదో తనకే సీటు కొనసాగిస్తే సరిపోతుంది కదా అని మథన పడుతున్న మోపిదేవి పైకి మాత్రం కొన్ని సందర్భాల్లో మనసు చంపుకోవాల్సిందే అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరో బీసీ నేత, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని సామాజిక న్యాయ సభా వేదికపైనే వెళ్లగక్కారు. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పుడు తన సొంత స్థలంలోనే ఏర్పాటు చేసి, అన్ని ఖర్చులూ భరించారు పార్థ సారథి! అలాంటి తనను జగన్ గుర్తించడం లేదన్నది ఆయన ఆవేదన చెందారు.
వైఎస్సార్సీపీలో చిచ్చురేపుతున్న నియోజకవర్గాల బాధ్యుల మార్పు
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరిస్థితి వైఎస్సార్సీపీలో మరీ దారుణం. ఆయన సొంత నియోజకవర్గం గురజాలలో ఆయనకు 2019లో టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి పక్కనపెట్టారు. ఇప్పుడైనా తన సీటు తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నా పార్టీలో పట్టించుకున్నవారే లేరు. ముఖ్యమంత్రిని ఒక్కసారి కలిసేందుకు అవకాశం ఇప్పించండి మహాప్రభో అని పార్టీ పెద్దల్ని వేడుకొనే పరిస్థితి! గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి విమర్శలు భరాయించలేక జంగా కృష్ణమూర్తి కుమారుడు కోటయ్య జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.
జంగాతోపాటు ఉండే మరో బీసీ నేత గురువాచారిని నాలుగున్నరేళ్లుగా నామినేటెడ్ పదవి ఇస్తామని ఊరిస్తూనే ఉన్నారు. రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లభించని వర్గాల నేతలూ వైఎస్సార్సీపీలో ఇమడ లేకపోతున్నారు. ఒక వర్గం మితిమీరిన ఆధిపత్యం తట్టుకోలేక గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ కూడా వైఎస్సార్సీపీకి బైబై చెప్పేశారు.
వైఎస్సార్సీపీలో డొక్కా మాణిక్య వరప్రసాద్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.! గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన, దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత. ఇప్పుడు సీఎంను కలిసే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. గతంలో డొక్కాను అడగకుండానే తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమించిన జగన్‌ఇప్పుడు మాజీ హోంమంత్రి సుచరితకు అప్పగించారు. అయోమయంలో పడిన డొక్కా తన పరిస్థితిపై స్పష్టత కోసం సీఎంను కలవాలన్నా కుదరడంలేదు.
వైఎస్సార్సీపీలో సామాజిక న్యాయం ప్రధాన సామాజిక వర్గాంలో పలుకుబడి ఉన్నవారికి తప్ప అణగారిన వర్గాల నాయకులు లేకుండాపోతోంది. జనం కూడా సామాజిక న్యాయ యాత్రకు స్వచ్ఛందంగా రావడంలేదు. రుణమాఫీ డబ్బులు ఇవ్వబోమని బెదిరించి డ్వాక్రా మహిళల్ని ఈ సభలకు తెస్తున్నారు. విధిలేక అక్కడి వరకూ వస్తున్న మహిళలు ఓ సెల్ఫీ దిగి వెళ్లిపోతున్నారు.
ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా