Babu Surety-Bhavishyathuku Guarantee Program Updates: వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఈ నెల 1వ తేదీ నుంచి ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో 45 రోజుల పాటు ప్రజలను నేరుగా కలిసి, వారిలో భరోసా కల్పించేందుకు సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడమే కాకుండా.. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి అధినేత వరకూ టీడీపీ పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని భావిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. వీలైనన్ని ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండేలా ఓ కార్యాచారణను రూపొందించుకున్నారు.
Chandrababu Visit From Today to 9th of This Month:టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు ఆయన సిద్దమయ్యారు. వివిధ నియోజకవర్గాల్లోని ప్రజలకు తెలుగుదేశం ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాలపై చంద్రబాబు నాయుడు అవగాహన కల్పించనున్నారు. మినీ మేనిఫెస్టోలో రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల ఉద్దేశ్యాలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు.
Chandrababu Will visit Anantapur and Kurnool Districts: రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిపుష్టి, రక్షణ, భవిష్యత్తు కోసం అంటూ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ మేనిఫెస్టో ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ఆ పార్టీ అధినేతచంద్రబాబు ప్రకటించారు. అయితే, ఆ ఆరు పథకాల ఉద్దేశ్యాలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ఆయనే స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి వరుసగా అయిదురోజుల పాటు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించేలా తొలిదశ ప్రణాళికలు రూపొందించారు. ముందుగా రాయదుర్గం నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభంకానుంది. రేపు కళ్యాణదుర్గంలోనూ, ఎల్లుండి గుంతకల్ నియోజకవర్గాల్లోనూ సాగనుంది. 8, 9 తేదీల్లో బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో సాగనుంది. పర్యటనలో భాగంగా చంద్రబాబు వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్ షోలు, సభల్లో పాల్గొనున్నారు.